SAKSHITHA NEWS

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

హుజురాబాద్ నియోజకవర్గం శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి

మాజీ ఎంఎల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస యాదవ్

కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల / మంత్రుల అవగాహనారాహిత్యం
కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలే అన్న అవగాహనతోనే కాంగ్రెస్ నాయకులు ఉన్నారని పొన్నం ప్రభాకర్ మాటల్లో తెలుస్తున్నది. ఇంతకంటే అవగాహనారాహిత్యం మరొకటి ఉండదు. కాళేశ్వరంలో నిర్మించిన వందలాది కాంపోనెంట్స్ ఈ మూడు బ్యారేజిలు కూడా ఉన్నాయి తప్ప అవే కాళేశ్వరం ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం స్వరూపాన్ని పొన్నంకు అతని సహచరులకు మరొక్కసారి తెలుపాల్సిన అవసరం ఉన్నది.

కాళేశ్వరం ప్రాజెక్టు విశేషాలు :

  • ఒకే ప్రాజెక్టులో బ్యారేజిలు, జలాశయాలు, గ్రావిటి కాలువలు, పైప్ లైన్లు, సొరంగాలు, భూగర్భ పంప్ హౌజ్ లు, సర్జ్ పూల్స్, విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు ఉండటం

ప్రాజెక్టు ప్రయోజనాలు 20 జిల్లాల్లో విస్తరించి ఉండటం, కొత్త ఆయకట్టు మరియు స్థిరీకరణ కలుపుకొని మొత్తం 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం

తాగు నీటి కోసం 40 టి‌ఎం‌సిలు, పారిశ్రామిక అవసరాల కోసం 16 టి‌ఎం‌సిల సరఫరా


  • 1.నీటిని సరఫరా చేసే మార్గం పొడవు = 1832 కి మీ

a. గ్రావిటి కాలువ పొడవు
= 1531 కి మీ
b. గావిటి టన్నల్ పొడవు = 203 కి మీ
C. ప్రెషర్ పైపు లైన్ పొడవు= 98 కి మీ
2. లిఫ్టులు = 22
3.పంపు హౌజ్ లు =21
4.అవసరమయ్యే విద్యుత్తు = 4627.24 మె వా
5. అవసరమయ్యే శక్తి (energy) = 13558 మీ యు
6. వాస్తవ విద్యుత్ వినియోగం (75%)
= 10150 మీ యు
7. విద్యుత్ సబ్ స్టేషన్లు
400 KV-6,
220 KV-8,
132 KV-4,
33 KV-3,
===
మొత్తం-21
===
8. పాత ఆన్ లైన్ జలాశయాలు = 5
9. కొత్తగా నిర్మిస్తున్న జలాశయాలు = 19
10. జలాశయాల నిల్వ సామర్థ్యం
141 టిఎంసిలు
Against 14 TMC in PCLIS

లింకు 2 లో నిర్మించిన గాయత్రి భూగర్భ పంప్ హౌజ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులు, మోటార్లు బిగించడం జరిగింది. ఒక్కొక్క పంపు లిఫ్ట్ సామర్థ్యం 3200 క్యూసెక్కులు.

గోదావరి నీటిని మేడిగడ్డ వద్ద 100 మీ ఎత్తు నుంచి కొండ పోచమ్మ సాగర్ దాకా 620 మీ ఎత్తు వరకు పంప్ చెయ్యడం. అంటే 520 మీ ఎత్తుకు నీటిని తరలించడం.

400 కె వి సబ్ స్టేషన్లు = 6,
220 కె వి సబ్ స్టేషన్లు = 8,
132 కె వి సబ్ స్టేషన్లు 2, 33 కె వి సబ్ స్టేషన్ 3 : మొత్తం 21 విద్యుత్ సబ్ స్టేషన్లు. ఇందులో ఒకటి Gas Insulated Sub Station కూడా ఉంది.

రోజుకు 2 టి‌ఎం‌సి ల నీటిని ఎత్తిపోసే పంప్ హౌజ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. రోజుకు 3 టి‌ఎం‌సిల నీటిని ఎత్తిపోయడానికి సివిల్ నిర్మాణాలు జరుగుతున్నాయి.

మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 150 కి మీ గోదావరి నది పునర్జీవనం, నదిలో 56 టి‌ఎం‌సిల నీటి నిల్వ. మొత్తం ప్రాజెక్టులో నీటి నిల్వ 141 టి‌ఎం‌సిలు

ఇంత పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని మేడిగడ్డ కు కుదించి వేసి, మేడిగడ్డలో కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కుంగి పోయిందని బిల్డప్ ఇచ్చి ప్రచారం చేసినారు. ప్రాజెక్టుపై మీ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం సుమారు 94 వేల కోట్లు.

తొలుత CWC ఆమోదించిన ప్రాజెక్టు అంచనా విలువ రు. 80,100 కోట్లు. ఆ తర్వాత మూడవ టిఎంసి పనులను కలిపి రు 1,27,000 కోట్లకు సవరించిన అంచనా విలువను CWC పంపడం జరిగింది. ఆ డి పి ఆర్ వారి పరిశీలనలో ఉన్నది.
ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల అంచనా విలువలు ఈ విధంగా ఉన్నాయి.

మేడిగడ్డ తొలి అంచనా విలువ(2016) : రు. 2591 కోట్లు, మొదటి సవరణ(2018) : రు.2456.51 కోట్లు, రెండవ సవరణ(2021) : రు. 4613 కోట్లు

అన్నారం తొలి అంచనా విలువ(2016) : రు. 1785 కోట్లు, మొదటి సవరణ(2018) : రు. 3260 కోట్లు, రెండవ సవరణ(2023) : రు. 2734.81 కోట్లు

సుందిళ్ళ తొలి అంచనా విలువ(2016) : రు. 1437 కోట్లు, మొదటి సవరణ(2018) : రు. 1895 కోట్లు, రెండవ సవరణ(2022) : రు. 2111.10 కోట్లు

1, 27,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ మూడు బ్యారేజీల విలువ 4613 + 2734.81 +2111.10 = 9458.91 కోట్లు మాత్రమే. మొత్తం ప్రాజెక్టు అంచనా విలువలో మూడు బ్యారేజీల విలువ 7.52 శాతం మాత్రమే. మిగాతావి ఇతర కాంపోనెంట్స్ కు సంబందించినవే.

మీరు ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14 టిఎంసిలు మాత్రమే. 160 టిఎంసిల నీటిని ఎట్టిపోసి ఎక్కడ నిల్వ చేసుకుంటారని CWC అభ్యంతరం లేవనెత్తింది. మీ ప్రాజెక్టులో నీటి అవసరాలకు, ప్రాజెక్టులో ప్రతిపాదించిన ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యానికి అసలు పొంతనే లేదని చెపుతూ ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకొమ్మని లేదా కృత్రిమ జలాశయాలు నిర్మించామని సలహా ఇచ్చింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యాన్ని 141 టిఎంసిలకు పెంచుకోవడం జరిగింది.

అట్లా పెంచుకున్నందు వలనే ఈ రోజు మిడ్ మానేరు, దాని కింద ఉన్న లోయర్ మానేరు, లింకు 4 లో ఉన్న అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ జలాశయాల్లోకి మొత్తం 83.87 టిఎంసిల నీటిని నింపుకోగలిగినాము.

మీరు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ప్రతిపాదించిన నిల్వ దోసేడు నీళ్ళు అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రతిపాదించిన నిల్వ సామర్థ్యం బిందేడు. ఇదీ మీకు మాకు ఉన్న తేడా.

2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాతనే కీలకమైన ఎల్లంపల్లి(20 టిఎంసిలు), మిడ్ మానేరు(27 టిఎంసిలు) పూర్తీ చేసినాము. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇవి కీలకమైన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు. మీరు ప్రారంభించి పూర్తి చేయకుండా అధురా వదిలిపెట్టి పోయారు. మేము అధికారంలోకి వచ్చాక ఆ రెండు జలాశయాల్లో ఉన్న భూసేకరణ, ముంపు గ్రామాల పునరావాసం తదితర సమస్యలన్నీ పరిష్కరించి వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చాము.

కాళేశ్వరం ప్రాజెక్టు కాంపోనెంట్స్ తో పాటు ఈ టెండు కీలక జలాశయాల పనులు కూడా పూర్తి చేశాము. అందుకే కాళేశ్వరం ఫలాలు రైతాంగానికి అందుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్త + స్థిరీకరణ కలుపుకొని సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగినాము. వాస్తవాన్ని అంగీకరించే సౌజన్యం కాంగ్రెస్ నాయకులకు లేదు.

“బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు మీద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ లో భాగమైన ఎల్లంపల్లి, నంది మేడారం, మిడ్ మానెరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి” అని పొన్నం గారు నిజాయితీగా ఒప్పుకున్నారు. మరి అవే జలాశయాలు కాళేశ్వరంలో కూడా అంతర్భాగాలే అన్న సంగతి ఎందుకు ఒప్పుకోరు ?

ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేసినప్పుడు ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా అలైన్మెంట్ మార్చలేదని మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాము. CWC సలహాల మేరకు ఈ ఆన్ లైన్ జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని 141 టిఎంసిలకు పెంచినాము. ఆ పెరిగిన జలాశయాల్లోకి నీటిని పంపగలిగినారు.

అవి ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసినా కూడా మీరు వినియోగించింది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అయిన జలాశయాలు, పంప్ హౌజ్ లు, సర్జ్ పూల్స్, కాలువలు, రెగ్యులేటర్లు, పైప్ లైన్లు, సొరంగాలు, విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లు కదా.

ఎల్లంపల్లి అప్పుడు ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా ఉండేది. రీ ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు కాళేశ్వరంలో కూడా భాగం అయ్యింది. అవి కాళేశ్వరంలో భాగం అయిన ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసిన నీళ్లే అయినా కాళేశ్వరం వ్యవస్థ ద్వారా చేరిన గోదావరి నీళ్లే అనే సంగతి తెలియదా పొన్నం.

కాళేశ్వరంలో ప్రాజెక్టులో ఒక చిన్న భాగమైన మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయినట్టు, ప్రాజెక్టు మీద ఖర్చు చేసిన లక్ష కోట్లు వృధా అయిపోయాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ నాయకులు అదే కాళేశ్వరం వ్యవస్థను మాత్రం బ్రహ్మాండంగా వినియోగించుకుంటున్నారు.

మేడిగడ్డలో మొత్తం 85 గేట్లు, 86 పిల్లర్లు ఉన్నాయి. వీటిని 7 బ్లాకులుగా నిర్మించడం జరిగింది. ఇందులో కుంగిపోయి ప్రమాదానికి గురి అయినవి 7 వ బ్లాకులో 3 పిల్లర్లు మాత్రమే. మిగతావి అన్ని కూడా ఆరోగ్యంగానే ఉన్నాయని ఇంజనీర్లే చెపుతున్నారు.

ఈ ఏడు జులై నెలలో 12 లక్షల క్యూసెక్కుల వరద మేడిగడ్డ బ్యారేజి నుంచి సురక్షితంగా కిందకు పోవడం ద్వారా ఇది రుజువయ్యింది. మేడిగడ్డ బ్యారేజి సురక్షితంగా ఉందని గోదావరి మాతనే ప్రపంచానికి చాటి చెప్పింది. కాళేశ్వరం విమర్శకుల వాదనలను పటాపంచలు చేసింది.

వారు ప్రచారం చేసిన “కాళేశ్వరం ప్రాజెక్టు వృధా” అన్న సిద్ధాంతాన్ని వారే అబద్దమని నిరూపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు జీవధార. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్.

ఇంత అద్భుతంగా పని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వృధా ప్రాజెక్టు ఎట్లా అవుతుంది ? నిరుపయోగం ఎట్లా అవుతుంది ? కాళేశ్వరం ఉపయోగం ఏమిటో రైతాంగానికి, ప్రజలకు తెలుసు. తెలువనిది మీకు, మీ సహచరులకు మాత్రమే పొన్నం .

కాళేశ్వరం ప్రాజెక్టులో లింకు 1 తప్ప అన్ని లింకులు వినియోగంలో ఉన్నాయి. రాజకీయాలు మాని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 వానాకాలం పంటల కోసమైనా లింకు 1 ని పునరుద్దరించే పని మీద శ్రద్ధ పెట్టమని కోరుతున్నాను.

మీ చేతగాని తనాన్నికప్పి పుచ్చుకోవడానికి మమ్ములను ఎల్లకాలం విమర్శిస్తూ కాలాయాపన చేస్తే ప్రజలు సహించరు. మీకు తగిన సమయంలో బుద్ది చెప్పక మానరు. కొంచెం సోయితో, అవగాహనతో మాట్లాడమని మిత్రుడు పొన్నం కి నా సలహా ఇస్తున్నాను. పూర్తి చేయవలసిన పనుల మీద దృష్టి పెట్టమని కోరుతున్నాను.

ఈ కారిక్రమంలో జమ్మికుంట $ హుజూరాబాద్ మునిసిపల్ చైర్మన్లు రాజేశ్వరరావు, రాధిక శ్రీనివాస్, కౌన్సిలర్స్, మాజీ జేపీటీసీ లు, మాజీ ఎంపీపీ లు , పార్టీ సీనియర్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS