SAKSHITHA NEWS

అరవై శాతం మంది రైతులకు రుణ మాఫీ కాకున్నా సిగ్గులేకుండా
కొమ్మూరి ప్రతాపరెడ్డి విజయోత్సవ ర్యాలీ
సిపిఎం విమర్శ

సాక్షిత సిద్దిపేట జిల్లా :
సిద్దిపేట జిల్లా చేర్యాల అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ కాకుండానే కొమ్మూరి ప్రతాపరెడ్డి సిగ్గు లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం రైతాంగాన్ని మోసగించడమేనని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టకుండా రైతులకు రుణమాఫీ చేయాలని, సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని వెంటనే ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రెండు లక్షల వరకు రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేర్యాల,కొమురవెల్లి, మద్దూరు,దూలిమిట్ట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం చేర్యాల పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ల బండి శశిధర్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన మల్లారెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ పూర్తిగా రుణమాఫీ చేయకుండానే చేర్యాలలో కొమ్మూరి ప్రతాపరెడ్డి రైతులందరికీ రుణమాఫీ చేశామని సంబరాలు జరుపుకోవడం ర్యాలీలు జరపడం సిగ్గుచేటు అన్నారు. ఓవైపు రైతులు బ్యాంకుల చుట్టూ రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతుంటే మాఫీ చేశామని సంబరాలు జరుపుకోవడం రైతాంగాన్ని మోసగించడమేనని అన్నారు. రైతాంగంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని రుణమాఫీ కానీ రైతులలో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నారని వారంతా వ్యవసాయ పనులు వదులుకొని బ్యాంకుల చుట్టూ వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇచ్చి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలండి డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా కౌలు రైతులకు 15000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించాలని కోరారు. రెండు లక్షల వరకు రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని అదేవిధంగా రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రుణమాఫీ కానీ రైతులందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఎం చేర్యాల మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో, మద్దూరు మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, కొమురవెల్లి మండల నాయకులు జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కృష్ణారెడ్డి, తాడూరి రవీందర్, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు బండ కింద అరుణ్ కుమార్, దాసరి ప్రశాంత్ నాయకులు బండకింది బాల నారాయణ, బోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS