SAKSHITHA NEWS

45 రోజుల్లో భూ సమస్యల అర్జీలకు పరిష్కారం

  • జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
  • దొరసానిపల్లిలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి
  • భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
  • ప్రజా సమస్యల పరిష్కారం నిర్లక్ష్యం చూపొద్దు
  • అధికారులతో మంత్రి సవిత
  • రాయలసీమ ద్రోహి జగన్ : మంత్రి సవిత ఫైర్

కడప/ప్రొద్దుటూరు : ప్రజల భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, 45 రోజుల్లో వినతులకు పరివష్కారాలు చూపుతామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రొద్దుటూరు నియోజక వర్గం దొరసానిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో కలిసి మంత్రి సవితమ్మ ప్రజల నుండి వినతులను స్వీకరించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గడిచిన అయిదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా భూ దందాలు, ఆక్రమణలు, కబ్జాలు చోటుచేసుకున్నాయన్నారు. గత పాలకులు పేదల భూములను కాజేశారన్నారు. వైసీపీ దౌర్జన్యాలతో తమ భూములు ఆక్రమించుకున్నారంటూ బాధితులు తమ ప్రభుత్వానికి వివిధ కార్యక్రమాల ద్వారా వినతి పత్రాలు అందజేశారన్నారు.

5 నెలల కాలంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై లక్షా 70 వేలకు పైగా వినతులు రాగా అందులో 80 వేల వరకు భూ కబ్జాలు, సమస్యలపైనే వచ్చాయన్నారు. బాధితుల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్పులు నిర్వహించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించారన్నారు. ఈ సదస్సుల్లో రెవెన్యూ, అటవీ, దేవాదాయ శాఖ అధికారులు రికార్డులతో సహా పాల్గొంటున్నారన్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలకు 45 రోజుల్లో పరిష్కారాలు చూపుతామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం నిర్లక్ష్యం చూపొద్దని అధికారులకు మంత్రి ఆదేశించారు. కార్యాలయాలకు వచ్చే సందర్శకులతో దురుసుగా ప్రవర్తించొద్దని మంత్రి సవిత స్పష్టంచేశారు
అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం 5 నెలల కాలంలోనే అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోందన్నారు. ఒకవైపు పల్లె పండుగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేశామన్నారు. ఉచిత ఇసుక అందజేస్తున్నామన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ రెడ్డి తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేశామన్నారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న మాట మీద నిలబడి, మెగా డీఎస్సీ నిర్వహణకు సీఎం చంద్రబాబునాయుడు తొలి సంతకం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల స్థాపనకు పెట్టుబడుదారులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
నేతన్నల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు
రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురాడానికి సీఎం చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నాయని మంత్రి సవిత తెలిపారు.

5 నెలల కాలంలో 5 సార్లు చేనేతపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారన్నారు. 10 వేల కోట్ల పెట్టుబడులతో నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొస్తున్నామన్నారు. మైలవరంలో టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున వృద్ధాప్యపు పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. త్రిఫ్ట్ ఫండ్, వీవర్స్ ముద్ర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నేతన్నలకు ఆరోగ్య బీమా పథకం అందజేయబోతున్నామన్నారు. చేనేత వస్త్రాలపై 5 శాతం మేర జీఎస్టీ రియింబెర్స్ మెంట్ ఇవ్వబోతున్నామన్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మర మగ్గాల కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు తెలిపారు. చేనేత వస్త్రాలు విక్రయించడానికి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చేనేత బజార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రాబు ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని, తమకు న్యాయం జరుగుతున్న నమ్మకం చేనేత కార్మికుల్లో ఏర్పడిందని మంత్రి తెలిపారు. బీసీల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఇటీవల జరిగిన బడ్జెట్ భారీ ఎత్తున నిధులు కేటాయించారన్నారు. బీసీ యువతకు ఉపాధి కల్పనకు 50 శాతం సబ్సిడీతో కూడిన రుణాలు అందజేయనున్నామన్నారు. రాయలసీమ ద్రోహి జగన్
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మంత్రి సవిత మండిపడ్డారు. అన్ని శాఖలు లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల్లో కూరుకుపోయాయన్నారు. చివరికి సొంత ప్రాంతం రాయలసీమలో ఏ అభివృద్ధి చేయలేదన్నారు. జగన్ సొంత నియోజక వర్గం పులివెందులలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇదే విషయం గత నెలలో నిర్వహించిన సమీక్షలో వెల్లడైందని, ఇది ఎంతో బాధాకరమని అన్నారు. అన్నమయ్య డ్యామ్ కొట్టకుపోయినా, ఎందరో మృత్యువాతపడినా జగన్ పరామర్శ కూడా చేయలేదన్నారు. రాయలసీమ ద్రోహి జగన్ అని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రొద్దుటూరు నియోజక వర్గ ప్రజలు సీనియర్ రాజకీయ నేత, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిని ఎన్నుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. ఆయన ప్రజా సేవలో ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. రాయలసీమ అభివృద్ధిలో వరదరాజుల రెడ్డి పాత్ర కీలకమని మంత్రి తెలిపారు.
మాది మంచి ప్రభుత్వం
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో కలిసి మంత్రి సవిత మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీనీ తమ ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు. పెన్షన్లు పెంచామని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, ఉచిత ఇసుక అందజేస్తున్నామని, పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో భూ దందాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అధికారులుగాని, మంత్రులుగాని, ఎమ్మెల్యేలుగాన ప్రజలకు కనిపించలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజాప్రతినిదులు, అధికారులంతా ప్రజల ముంగిటకు వెళ్తున్నామని, తమది మంచి ప్రభుత్వమని మంత్రి సవిత తెలిపారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ అధితి సింగ్, ఆర్డీవో ఆద్య, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS