సింగరేణి కార్మిక హక్కుల కోసం అలుపెరుగని పోరాటం.

Sakshitha news

సింగరేణి కార్మిక హక్కుల కోసం అలుపెరుగని పోరాటం….

కార్మిక వర్గ శ్రేయస్సు కోసం పాటుపడిన మహానాయకుడు కొమురయ్య….

30వ వర్ధంతి సభలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్…

సాక్షిత పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : సింగరేణి కార్మిక వర్గ శ్రేయస్సు కోసం జీవితాంతం పోరాడిన మహానాయకుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ మాజీ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ మనుబోతుల కొమురయ్య అని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ కొనియాడారు.

గోదావరిఖని భాస్కర్‌రావు భవన్‌లో కొమురయ్య 30వ వర్ధంతి సభ నిర్వహించారు. ముందుగా కొమురయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మడ్డి ఎల్లా గౌడ్ మాట్లాడుతూ.. కొమురయ్య నాయకత్వంలో సాగిన కార్మిక పోరాటాలు సింగరేణి కార్మికుల జీవితాల్లో చారిత్రాత్మక మార్పులకు నాంది పలికాయని అన్నారు.

కార్మికుల శ్రమకు తగిన వేతనాలు, వార్షిక ఇంక్రిమెంట్లు, వివిధ అలవెన్సుల సాధన కోసం ఆయన నిరంతరం పోరాడారని తెలిపారు. బొగ్గు పరిశ్రమలో మొదటి వేజ్ బోర్డు నుంచి ఆరో వేజ్ బోర్డు వరకు కార్మికుల తరఫున బలమైన ప్రాతినిధ్యం వహించి మెరుగైన వేతనాలు, సంస్థ పరిరక్షణకు బాటలు వేశారని పేర్కొన్నారు.

జేబీసీసీఐ వేదికలపై కార్మికుల గొంతుకగా నిలిచి ఎల్టీసీ, క్యాడర్ స్కీమ్, పదోన్నతులు, పెన్షన్ వంటి కీలక హక్కుల సాధనకు కొమురయ్య పోరాడారని ఎల్లా గౌడ్ గుర్తుచేశారు. ఆయన పోరాటాల ఫలితంగా కార్మికులకు వేతన ప్రయోజనాలతో పాటు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కుటుంబ సంక్షేమం వంటి అంశాల్లోనూ గణనీయమైన పురోగతి సాధ్యమైందన్నారు.

కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ కోసం ఆయన చేసిన ఉద్యమాలు వేలాది కార్మిక కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించే దిశగా మార్గం చూపాయని అన్నారు. మహిళలు, పిల్లలను భూగర్భ గనుల పనుల నుంచి తప్పించి సురక్షితమైన ఉపరితల పనుల్లో నియమించేలా చేసిన పోరాటం కార్మిక సంక్షేమ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.

పని ప్రదేశాల్లో భద్రత, మెరుగైన పని పరిస్థితులు, కార్మికులకు గౌరవప్రదమైన జీవనం, వారి కుటుంబాలకు సంక్షేమ భరోసా కోసం కొమురయ్య చేసిన పోరాటాలు సింగరేణి కార్మిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేశాయని అన్నారు. ఆయన సాధించిన హక్కులు భవిష్యత్ తరాల కార్మికులకు కూడా పోరాట స్ఫూర్తిని అందిస్తున్నాయని తెలిపారు.

ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సంకె అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు వేల్పుల నారాయణ, ఆర్జీ-1 బ్రాంచ్ ఆఫీస్ బేరర్లు మాదన మహేష్, బోగ సతీష్ బాబు, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం.ఎ. గౌస్, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్, ఆర్జీ-1 బ్రాంచ్ నాయకులు ఎస్. వెంకట్ రెడ్డి, సిద్ధమల్ల రాజు, పిట్ కార్యదర్శులు బండి మల్లేష్, కారంపూరి వెంకన్న, నాయకులు బి. సమ్మయ్య, కొత్త రాజయ్యతో పాటు పలువురు కార్యకర్తలు, కార్మికులు పాల్గొని కొమురయ్యకు ఘన నివాళులు అర్పించారు.