యూజీడీ పనుల్లో అవినీతిపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు….

Sakshitha news

యూజీడీ పనుల్లో అవినీతిపై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు….

“రక్షించకున్నా.. భక్షించకండి” అంటూ ఎమ్మెల్యేపై సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌ మార్కపురి సూర్య ధ్వజం….

సాక్షిత పెద్దపల్లి జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌ మార్కపురి సూర్య, సీపీఐ నగర కార్యదర్శి కే. కనకరాజు తెలిపారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

రామగుండం కార్పొరేషన్‌కు వచ్చిన సుమారు రూ.16 కోట్ల స్టాంప్‌ డ్యూటీ నిధులను దారి మళ్లించి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ (యూజీడీ) పనులకు కేటాయించారని వారు ఆరోపించారు. ఈ పనులకు బహిరంగంగా టెండర్లు నిర్వహించకుండా కేవలం ఏడుగురు కాంట్రాక్టర్లకు ప్యాకేజీలను అప్పగించారని, పనుల అంచనా వ్యయంలోనూ అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

యూజీడీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, దీనిపై సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ నాయకులు విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీబీఐ, ఈడీ డైరెక్టర్లకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

రామగుండం కార్పొరేషన్‌లో స్థానిక కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతోందని, పలు పనులను హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని నాయకులు ఆరోపించారు. కాంట్రాక్టుల విషయంలో కమిషన్ల వ్యవహారం నడుస్తోందని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.
“వెయ్యి రోజుల పాలనలో నీతిగా, నిజాయితీగా పాలన అందిస్తామని చెప్పిన పాలకులు.. అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలి” అని వారు డిమాండ్‌ చేశారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న అవినీతే పాలకుల పాలనకు నిదర్శనమని విమర్శించారు.

“రక్షకుడిగా ఉంటానన్న ఎమ్మెల్యే.. రామగుండం ప్రజలను రక్షించకున్నా దయచేసి వారిని భక్షించకండి” అంటూ మార్కపురి సూర్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రామగుండం మున్సిపల్‌ కమిషనర్‌ స్పందించి, యూజీడీ పనులకు సంబంధించిన ఏడు ప్యాకేజీల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా, విచారణ పూర్తయ్యే వరకు బ్లాక్‌లిస్టులో పెట్టాలని వారు డిమాండ్‌ చేశారు. పనుల నాణ్యతపై కూడా సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, నగర నాయకులు శనిగరపు చంద్రశేఖర్, ఆసాల నవీన్, అబ్దుల్‌ కరీం, రాణవేణి సుధీర్‌కుమార్, సాధుల శివ, పోతరాజు నాగరాజు, శనిగరపు తిరుమల తదితరులు పాల్గొన్నారు.