“సింగరేణి అధికారుల పీఆర్పీ వెంటనే విడుదల చేయాలి..

Sakshitha news

సింగరేణి అధికారుల పీఆర్పీ వెంటనే విడుదల చేయాలి….

రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్ల నారాయణరెడ్డి…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, సింగరేణి కంపెనీ ఆర్జీ-3 ప్రాంతంలో సీఎంఓ అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకోగా, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్ల నారాయణరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి వెలుగులు పంచే బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులకు రావాల్సిన పీఆర్పీని సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగుల సంక్షేమం గురించి గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, ఇప్పుడు వారి న్యాయమైన హక్కుల విషయంలో మౌనం వహించడం సిగ్గుచేటని అన్నారు.

సింగరేణి లాభాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు వాటాలు తీసుకోవడంలో ముందుంటాయని, కానీ సంస్థ అభివృద్ధికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న అధికారులకు రావాల్సిన పీఆర్పీ చెల్లించే విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం దుర్మార్గమైన వైఖరని మండిపడ్డారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్ల వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని, అధికారులను నిరసనలకు దిగే పరిస్థితి తీసుకురావడం ప్రభుత్వాల వైఫల్యమని పేర్కొన్నారు. శ్రమించే ఉద్యోగులను గౌరవించని ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోతుందని వ్యాఖ్యానించారు.

సింగరేణి అధికారులు అడుగుతున్నది ఎలాంటి ప్రత్యేక వరం కాదని, వారికి రావాల్సిన చట్టబద్ధమైన, న్యాయమైన హక్కేనని స్పష్టం చేశారు. వెంటనే అధికారులతో చర్చలు జరిపి పీఆర్పీ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సమస్యను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అధికారులకు న్యాయం జరిగేలా బీజేపీ తరఫున అన్ని విధాలా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాజీ మొలుమూరి శ్రీనివాస్, దంతుల సురేష్, ఎండీ జానీ, పరంకుష్, శ్రీనివాస్ చారి, ఆర్జీ-3 సీఎంఓఏ అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఎస్టేట్ అధికారి ఐలయ్య, సివిల్ డివిజన్‌కు చెందిన రాజేందర్ కుమార్, శ్రీహర్ష, ప్రీతి తదితరులు, పెద్ద సంఖ్యలో సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top