మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

Sakshitha news

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

ప్రజా పాలనలో వెయ్యి రోజుల ప్రగతిని వివరిస్తూ.. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా

మహా ధర్నా సన్నాహక సమావేశంలో ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు

హైదరాబాద్: సెప్టెంబర్ 5
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీ ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

మహా ధర్నా ఏర్పాట్లపై హైదరాబాద్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మంత్రులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజా పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా వ్యవహరించకుండా అసెంబ్లీకి హాజరు కాకపోవడాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

వెయ్యి రోజులుగా జీతం తీసుకుంటూ ప్రజా సమస్యలను పట్టించుకోరా?

వెయ్యి రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి హాజరు కాకుండా, తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రతిపక్ష పాత్రను నిర్వర్తించకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన బాధ్యతలను నిర్వర్తించనప్పుడు ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు.

కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.

ప్రజా పాలనలో క్షేత్రస్థాయిలో సంక్షేమ ఫలాలు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని, పదేళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్యం తదితర రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

భారీగా తరలిరావాలి

ఆదివారం జరిగే మహా ధర్నాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని మంత్రులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చేలా డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు సమన్వయం చేయాలని ఆదేశించారు.

NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా ధర్నాను విజయవంతం చేయాలని సూచించారు.

ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశం

మహా ధర్నా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సమావేశమై ఏర్పాట్లను పరిశీలించాలని మంత్రులు ఆదేశించారు.

అలాగే రేపటి మహా ధర్నాకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్లను సమన్వయం చేసుకుంటూ మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు గారు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
సమావేశంలో మంత్రి అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.