మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు?
హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది.
13(1)A, 13(2) పీసీ యాక్ట్ కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది. వాటితో పాటు 409, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. మొత్తంగా నాలుగు సెక్షన్ల కింద కేటీఆర్‌పై ఏసీబీ కేసులు నమోదు చేసింది.
ఫార్ముల్ ఈ- రేసింగ్ కేసులో.. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, A3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇండనీర్ బీఎల్ఎస్ రెడ్డిగా ఏసీబీ పేర్కొంది…
ఇదే క్రమంలో నాంపల్లి ఏసీబీ కోర్టుకు అధికారులు ఎఫ్ఐఆర్ కాపీని సమర్పిం చారు. మాజీ మంత్రి కేటీఆర్ మీద పీసీ యాక్టు కింద కేసు నమోదు చేసినట్టు కోర్టుకు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా ఓ విదేశీ సంస్థకు నిధుల బదలాయింపు జరిగిందన్నది ప్రధాన అభియోగం కాగా.. అధికార దుర్వినియోగం చేశారన్నది మరో అభియోగంగా తెలు స్తోంది. కేబినెట్ ఆమోదం లేకుండా మంత్రిగా ఉన్న కేటీఆర్ తన సొంత నిర్ణయంతో హెచ్ఎండీఏ బోర్డు నుంచి విదేశీ కంపెనీకి నిధులు బదలాయించినట్టు తెలుస్తోంది.
కేటీఆర్ ఆదేశాలతోనే.. డబ్బులు చెల్లించినట్టుగా హెచ్ఎండీఏ అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.ఆర్బీఐ అనుమతి లేకుండా ఓ విదేశీ సంస్థకు ఇండియన్ కరెన్సీ రూపంలో డబ్బు చెల్లించనట్టయితే.. రూ.8 కోట్ల పెనాల్టీ ఉంటుందని తెలుస్తోంది.
అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే.. ఆర్బీఐ ఈ పెనల్టీ వేయటంతో.. ఈ రేసుకు సంబంధించిన మొత్తం వ్యవహారం బట్ట బయలైనట్టు తెలుస్తోంది.