గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

Sakshitha news

గణేష్‌ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
ప్రశాంతంగా, వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలి….

— ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్‌…

సెప్టెంబర్‌ 4న.మాంసం విక్రయాలు నిలిపివేయాలి…

–అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ…

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : గణేష్‌ ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జనోత్సవాలను గతంలో కంటే మరింత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్‌. రాజ్‌ ఠాకూర్‌ అధికారులను ఆదేశించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో గణేష్‌ ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

మంచిర్యాల, చెన్నూరు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో గణేష్‌ విగ్రహాలు గోదావరి వంతెన వద్ద నిమజ్జనానికి తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల అధికారులు, సింగరేణి, పోలీసు శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. రామగుండం నగర పరిధిలోని విగ్రహాలను ఒకే రోజున నిమజ్జనం చేయాలన్న విజ్ఞప్తుల నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు.

ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు వెళ్లేందుకు మార్గం ఉండేలా మండపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల నిర్వాహకులు రహదారులను తవ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు అందిస్తున్నందున అక్రమంగా, ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలను లైన్లకు అనుసంధానం చేయవద్దని, షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాలను నివారించేందుకు తప్పనిసరిగా ఎంసీబీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద ఇసుక బకెట్లు, నీటి డ్రమ్ములు సిద్ధంగా ఉంచాలని, పరిశుభ్రత పాటించాలని కోరారు.

గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జన సమయంలో సేవలందించేందుకు స్వచ్ఛంద కార్యకర్తల సహకారం తీసుకోవడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమ సిబ్బందిని నగర పాలక సంస్థ సమన్వయంతో సేవలకు పంపించాలని ఎమ్మెల్యే కోరారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా రహదారుల మధ్యలో వాహనాలను నిలపకుండా నిర్ణీత ప్రాంతాల్లోనే పార్కింగ్‌ చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు.

గతం కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాలి
రామగుండం నగర మేయర్‌ మహంకాళి స్వామి మాట్లాడుతూ సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కో సంస్థలు నగర పాలక సంస్థతో సమన్వయం చేసుకుని గత ఏడాది కంటే మెరుగైన ఏర్పాట్లు చేయాలని కోరారు. విగ్రహాలు సాఫీగా తరలేందుకు యుద్ధప్రాతిపదికన రహదారుల గుంతలు పూడ్చాలని, రహదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని సూచించారు.

నిమజ్జనం రోజున విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, గోదావరి వంతెన వద్ద మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని విద్యుత్‌ అధికారులను కోరారు. వినాయక చవితి నుంచి అన్ని కూడళ్లలో విద్యుత్‌ దీపాలతో అలంకరణ చేపట్టాలని అన్నారు. బి పవర్‌హౌస్‌ నుంచి గోదావరి వంతెన వరకు పారిశుద్ధ్య నిర్వహణతో పాటు వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.

సమన్వయంతో నిమజ్జన ఏర్పాట్లు
అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్‌ జె. అరుణశ్రీ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల సమన్వయంతో గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనోత్సవ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రహదారుల గుంతల పూడ్చివేత, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, బారికేడింగ్‌, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర చర్యలు చేపడుతున్నామని వివరించారు.

శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 4న. మాంసం విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని స్థానిక మాంసం వ్యాపారులను కోరారు. ఈ మేరకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘించి మాంసం విక్రయాలు నిర్వహిస్తే లైసెన్సులు రద్దు చేయడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి పవిత్ర మాట్లాడుతూ నిమజ్జనం రోజున అంబులెన్స్‌లతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏసీపీ ముడుత రమేష్‌ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తంగా సేవలు అందిస్తామని అన్నారు.

నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేందుకు వీలైనంత త్వరగా విగ్రహాలను తరలించేందుకు ఉత్సవ కమిటీలు, గణేష్‌ మండపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు.

ఏసీపీ (ట్రాఫిక్‌) శ్రీనివాస్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. రహదారుల మధ్యలో వాహనాలు పార్కింగ్‌ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ పాతపెల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ అధికారులు, సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కో, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు, పోలీసు అధికారులు, ఆర్‌అండ్‌బీ, వైద్య, మత్స్య శాఖల అధికారులు, హెచ్‌కేఆర్‌ సంస్థ ప్రతినిధులు, విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌, హిందూ వాహిని ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.