ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలు

Sakshitha news

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి, అవార్డులు అందజేస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/
వ్యక్తులపై ఆధారపడకుండా వ్యవస్థ ఆధారంగా పనిచేసేలా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. విద్యా ప్రక్రియను పటిష్టం చేస్తే ఫలితాలు, ర్యాంకులు సహజంగానే వస్తాయని స్పష్టం చేశారు.

ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హాజరై ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి అవార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల క్రితం ఉన్న విద్యా వ్యవస్థకు, నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన యుగంలోని విద్యా వ్యవస్థకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. వ్యవస్థ వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యా రంగం కూడా అందుకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని తెలిపారు.

గత రెండున్నర సంవత్సరాలుగా జిల్లాలో వ్యక్తులపై ఆధారపడకుండా, ఎవరైనా ఉన్నా లేకపోయినా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా విధానాలను రూపొందిస్తూ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. కేవలం నంబర్లు, ర్యాంకుల కోసం కాకుండా విద్యా ప్రక్రియను పటిష్టం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించామని పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులతో నిరంతరం చర్చిస్తూ విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు, మెరుగుదలలకు చర్యలు చేపట్టామని కలెక్టర్‌ తెలిపారు. అందరి సమష్టి కృషి, సహకారంతో వ్యక్తులతో సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించగలిగామని అన్నారు.

విద్యార్థుల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తాము ఆచరించే విషయాలను విద్యార్థులకు బోధిస్తూ ఆదర్శంగా నిలవాలని సూచించారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా బోధనా పద్ధతులను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని కోరారు.

జిల్లా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకరిస్తున్న ఉపాధ్యాయులందరికీ కలెక్టర్‌ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను అభినందించారు.
అనంతరం ఉత్తమ సేవలు అందించిన 58 మంది ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్‌ శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించి అవార్డులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద, అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి పీఎం. షేక్‌, సెక్టోరియల్‌ అధికారి మల్లేశం, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.