బహిరంగ మద్యానికి బ్రేక్‌.. డీజేలు, అనుమతి లేని డ్రోన్లపై ఉక్కుపాదం….

Sakshitha news

బహిరంగ మద్యానికి బ్రేక్‌.. డీజేలు, అనుమతి లేని డ్రోన్లపై ఉక్కుపాదం….

రామగుండం కమిషనరేట్ పరిధిలో నెల రోజుల పాటు నిషేధాజ్ఞలు.. అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తే చర్యలు….

— సీపీ అంబర్ కిషోర్ ఝా…

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం/ : ప్రజల భద్రత, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. అలాగే అధిక శబ్దంతో కూడిన డీజే సౌండ్స్ వినియోగం, అనుమతి లేని డ్రోన్ల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌ల పరిధిలో సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 1 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని సీపీ వెల్లడించారు. పరిస్థితులను బట్టి వీటి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సీపీ తెలిపారు. మద్యం మత్తులో వీధులు, రహదారులపై అసభ్య పదజాలంతో ప్రవర్తిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 223, హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డీజేలకు అనుమతి తప్పనిసరి
చిన్నారులు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బంది కలగకుండా, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధిక శబ్దంతో కూడిన డీజే సౌండ్స్ వినియోగంపై నిషేధాజ్ఞలను పొడిగించినట్లు సీపీ తెలిపారు.

ప్రజలను సమీకరించే కార్యక్రమాల్లో డీజే సౌండ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. కార్యక్రమాల నిర్వహణలో మైక్ సెట్ అవసరమైతే సంబంధిత డివిజన్ ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనుమతి లేకుండా డ్రోన్లు ఎగురవేస్తే కఠిన చర్యలు
ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అనుమతి లేని డ్రోన్ల వినియోగాన్ని పోలీసులు కఠినంగా పర్యవేక్షించనున్నారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగించవద్దని సూచించారు.

ధర్నాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో సెప్టెంబర్ 1 ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 1 ఉదయం 6 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు.

ఈ కాలంలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే సంబంధిత పోలీస్ అధికారుల నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించారు.

బంద్‌ల పేరుతో సంస్థలు, కార్యాలయాలను బలవంతంగా మూసివేయించడం, ఒత్తిడి చేయడం, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కోరారు.