గణేష్ ఉత్సవాల్లో మత సామరస్యానికి పెద్దపీట…
శాంతియుత ఉత్సవాలే లక్ష్యం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు….
మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి: ఏసీపీ వెంకటేశ్వర్లు….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం, చెన్నూర్/ :
గణపతి నవరాత్రి ఉత్సవాలను మతాలకు అతీతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల నేపథ్యంలో చెన్నూర్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మార్వాడి భవన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మండపాల ఏర్పాటుకు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. డీజేలు, సౌండ్ సిస్టమ్ల వినియోగంపై అమల్లో ఉన్న నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.
ఉత్సవాల సందర్భంగా మత సామరస్యానికి ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. ఏవైనా సమస్యలు తలెత్తితే స్వయంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించే శాంతి యాత్రలో యువత, గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఏసీపీ కోరారు. నిర్ణయించిన క్రమసంఖ్యను పాటిస్తూ ర్యాలీని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, సీఐ బన్సీలాల్, మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్మన్ వినయ్ కుమార్, కౌన్సిలర్లు అజీమ్, సంతోష్, కో-ఆప్షన్ సభ్యులు సాధనబోయిన కృష్ణ, కాంగ్రెస్ నాయకులు పెద్దింటి శ్రీనివాస్, బ్రహ్మయ్య, శాంతి కమిటీ నాయకులు బి.జనార్దన్ రావు, బొల్లంపల్లి లక్ష్మీరాజ గౌడ్, పట్టణంలోని వివిధ కుల సంఘాల నాయకులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST