యువతకు ఉపాధి దిశగా మెగా జాబ్ మేళా, భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రభుత్వం…..
–ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి కార్యక్రమాన్ని సందర్శించి, యువతకు లభిస్తున్న ఉద్యోగ అవకాశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరామణ రావు, ఎంపీ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, గతంలో నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు.
యువత సంక్షేమంతోనే “తెలంగాణ రైజింగ్” సాధ్యమవుతుందని, యువతకు మంచి భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర గత ప్రభుత్వాల హామీలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో అనేక కంపెనీలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతున్నారని తెలిపారు.
రామగుండం ప్రాంతంలో సుమారు 30 వేల మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని, అక్కడ కూడా మెగా జాబ్ మేళా నిర్వహించాలని మంత్రి ని కోరారు. సింగరేణి, ఎన్‌టీపీసీ వంటి సంస్థలతో కలిసి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY