కరెంట్ కోతలను నిరసిస్తూ రాజపేట సబ్ స్టేషన్ ఎదుట రైతుల రాస్తారోకో- ధర్నా

Sakshitha news

కరెంట్ కోతలను నిరసిస్తూ రాజపేట సబ్ స్టేషన్ ఎదుట రైతుల రాస్తారోకో- ధర్నా

సాక్షిత వనపర్తి

వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ రాజపేట, పెద్దతాండా గ్రామపంచాయతీ పరిధిలోని రైతులు రాజపేట సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా జయరాములు నాయక్ మాట్లాడుతూ….. పంటలు కీలక దశలో ఉన్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

“రైతు పంటకు నీరు కావాలి.. నీటికి కరెంట్ కావాలి. కరెంట్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోం” అని నాయకులు, రైతులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాజపేటకు చెందిన నాయకులు, రైతులు కల్కి తిరుపతయ్య, జాన్య నాయక్, నార్య నాయక్, సురేష్, బిచ్చా నాయక్, లోక్య నాయక్, రాహుల్, బక్క బాలరాజు తదితర గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.