ధాన్యం కొనుగోళ్లలో దూసుకెళ్తున్న పెద్దపల్లి జిల్లా…
ఒక్కరోజే 15 వేల మెట్రిక్ టన్నుల సేకరణ, రైతులకు రూ.505 కోట్లకు పైగా చెల్లింపులు….
–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి, పెద్దపల్లి మే 21న. జిల్లాలో రబీ 2025-26 సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, పారదర్శకంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మే 21న ఒక్కరోజే 15,005 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాలో మొత్తం 1,77,915 ఎకరాల్లో వరి సాగు జరగగా, అందులో 1,65,461 ఎకరాల్లో దొడ్డు రకం, 12,454 ఎకరాల్లో సన్న రకం పంట సాగు చేసినట్లు తెలిపారు. మొత్తం 4,06,174 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన 311 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 3,32,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకోగా, అందులో 2,67,929 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. ఇందులో 2,67,075 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 854 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉందని తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా రైస్ మిల్లులకు తరలిస్తున్నామని, ఇప్పటివరకు 2,65,824 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించగా, కేంద్రాల్లో కేవలం 2,105 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే నిల్వలో ఉందన్నారు.
ఇప్పటివరకు 30,690 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా, కనీస మద్దతు ధర ప్రకారం రూ.634.82 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు తెలిపారు. రైతులకు చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే 26,493 మంది రైతుల ఖాతాల్లో రూ.505.70 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు.
ధాన్యం రవాణా కోసం 580 ట్రక్కులను అందుబాటులో ఉంచామని, అవసరమైతే ట్రాక్టర్లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 124 రైస్ మిల్లులు ఓపీఎంఎస్‌లో ట్యాగ్ చేయబడ్డాయని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 88.02 లక్షల గన్నీ బ్యాగులు సరఫరా చేయగా, అదనంగా 4 లక్షల గన్నీలు నిల్వలో ఉన్నాయని తెలిపారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల నుంచి భారీ స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టి, బోనస్ చెల్లింపులతో రైతులకు మేలు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే సీఎంఆర్ బియ్యం సరఫరాలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి, లక్ష్యాల సాధనలో ముందంజలో ఉందని తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు.

