సీఎంఆర్ బియ్యం డెలివరీలో జాప్యం వద్దు…

Sakshitha news

సీఎంఆర్ బియ్యం డెలివరీలో జాప్యం వద్దు…

బకాయిలు చెల్లించకుంటే డిఫాల్ట్ రైస్ మిల్లర్ల ఆస్తులపై చర్యలు….
2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోదాముల గుర్తింపు….

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి// :

2025-26 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యం డెలివరీని రైస్ మిల్లర్లు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి రైస్ మిల్లర్లతో సీఎంఆర్ డెలివరీ, డిఫాల్ట్ మిల్లర్ల బకాయిలు, గోదాముల లభ్యత తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎంఆర్ బియ్యం డెలివరీని ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు మిల్లర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లు తమ బకాయిలను వెంటనే చెల్లించాలని స్పష్టం చేశారు.

బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆస్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో బకాయిలను పూర్తిగా చెల్లించిన రైస్ మిల్లర్లకు తదుపరి సీజన్‌లో ధాన్యం అలాట్మెంట్ చేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మిల్లర్లు బకాయిలను సకాలంలో చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.

2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు ఏర్పాట్లు
వానాకాలం ధాన్యం కొనుగోళ్లను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యంతో గోదాములను ముందుగానే గుర్తించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల అనంతరం నిల్వకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ గోదాములను అనుమతి లేకుండా ఎవరికీ కేటాయించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. గోదాముల లభ్యత, నిల్వ సామర్థ్యం, వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

సీఎంఆర్ డెలివరీ, ధాన్యం నిల్వ, గోదాముల నిర్వహణ తదితర అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీకాంత్, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు