రూ.24.18 కోట్ల ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్….

Sakshitha news

రూ.24.18 కోట్ల ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్….

లక్ష్మి ఇండస్ట్రీస్ మిల్లింగ్‌లో భారీ అక్రమాలు గుర్తింపు : పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, సుల్తానాబాద్/ : రూ.24.18 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ జి. కృష్ణతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ కేసు వివరాలను వెల్లడించారు.

అరెస్టయిన నిందితులు
ఏ-1 రేణికుంట మధు (46) — రవీందర్ కుమారుడు, వల్లంపట్ల గ్రామం, ఇల్లంతకుంట మండలం, సిరిసిల్ల జిల్లా, లక్ష్మి ఇండస్ట్రీస్ మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్నారు.
ఏ-2 రేణికుంట రవీందర్ రెడ్డి — నర్సింహ కుమారుడు, వల్లంపట్ల గ్రామం, ఇల్లంతకుంట మండలం, సిరిసిల్ల జిల్లా. లక్ష్మి ఇండస్ట్రీస్ పార్టనర్‌గా ఉన్నారు.

10,015 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం అప్పగింత
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ (TGSCSCL), పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో KMS 2023-24లో సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలోని లక్ష్మి ఇండస్ట్రీస్‌కు కస్టమ్ మిల్లింగ్ కోసం 10,015.636 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం అప్పగించినట్లు డీసీపీ తెలిపారు.

అప్పగించిన ధాన్యానికి అనుగుణంగా 6,662.880 మెట్రిక్ టన్నుల CMR బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా, ఇప్పటివరకు మిల్లర్ 1,577.289 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అందించినట్లు తెలిపారు. అదనంగా 64.872 మెట్రిక్ టన్నుల సి ఎం ఆర్ కు సమానమైన నగదు స్వీకరించినట్లు పేర్కొన్నారు.

దీంతో 5,020.719 మెట్రిక్ టన్నుల సి ఎం ఆర్ బియ్యం బకాయి ఉండగా, దానికి సమానమైన 7,493.610 మెట్రిక్ టన్నుల ధాన్యం డిఫాల్ట్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం రూ.24,18,59,070గా గుర్తించినట్లు డీసీపీ వెల్లడించారు.

భౌతిక తనిఖీలో బయటపడిన అక్రమాలు
ఈ నెల 6న సివిల్ సప్లైస్ అధికారులు M/s లక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లును భౌతికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్‌కు అప్పగించిన ప్రభుత్వ ధాన్యానికి సంబంధించిన స్టాక్ మిల్లు ప్రాంగణంలో భౌతికంగా అందుబాటులో లేదని గుర్తించారు.

ప్రభుత్వ ధాన్యం నిల్వలను సక్రమంగా లెక్కల్లో చూపకుండా దారి మళ్లించి దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పెద్దపల్లి జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం, బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ బి. రామ్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

Scroll to Top