క్షయ, హెచ్‌ఐవీపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి….

Sakshitha news

క్షయ, హెచ్‌ఐవీపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి….
అనుమానితులకు సకాలంలో పరీక్షలు.. అధిక ప్రమాద వర్గాలకు గోప్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్‌…

— కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి/ : క్షయ, హెచ్‌ఐవీ నివారణపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. క్షయ లక్షణాలను సకాలంలో గుర్తించి అనుమానితులకు వెంటనే పరీక్షలు నిర్వహించడంతో పాటు, వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం సమావేశంలో కలెక్టర్ పాల్గొని సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో క్షయ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాలు, వ్యాధి లక్షణాల గుర్తింపు, పరీక్షలు, చికిత్స తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

క్షయ లక్షణాలపై ప్రజలకు అవగాహన
ప్రతి గ్రామంలో క్షయ వ్యాధి ప్రధాన లక్షణాలు, వ్యాధిని గుర్తించే విధానం, అవసరమైన పరీక్షలు, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. క్షయ లక్షణాలు ఉన్న వారిని సకాలంలో గుర్తించి పరీక్షలు నిర్వహించాలని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి చికిత్స పూర్తయ్యే వరకు పర్యవేక్షించాలని ఆదేశించారు.

వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
హెచ్‌ఐవీ పరీక్షలకు సంకోచం వద్దు
పెద్దపల్లి జిల్లా హెచ్‌ఐవీ పరంగా అధిక ప్రమాదం ఉన్న జిల్లాగా ఉన్నందున నివారణ, నియంత్రణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు. హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవడంలో ఎవరూ సిగ్గు, సంకోచాలకు గురికావాల్సిన అవసరం లేదని, ముందస్తుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని గుర్తించి సకాలంలో వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు.

మత్తు పదార్థాలను ఇంజెక్షన్ల ద్వారా తీసుకునే సమయంలో ఒకే సూది, సిరంజిని పలువురు ఉపయోగించే వారు, ఒకేసారి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది భాగస్వాములతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నవారు వంటి అధిక ప్రమాద వర్గాలను గుర్తించి హెచ్‌ఐవీ పరీక్షలు చేయించేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అధిక ప్రమాద వర్గాలకు గోప్యతతో పరీక్షలు, కౌన్సెలింగ్‌, అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను తొలగించేలా శాస్త్రీయ అవగాహన కల్పించాలని, స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించాలని అన్నారు.
క్షయ, హెచ్‌ఐవీ నివారణ కార్యక్రమాల్లో సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పవిత్ర, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.