ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి…

Sakshitha news

ఉపాధ్యాయుల మాట వినండి.. జీవితానికి బంగారు బాట వేసుకోండి…

నేటి విద్యార్థులే రేపటి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రజాప్రతినిధులు…

సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ :
విద్యార్థులు ఉపాధ్యాయుల మాటకు గౌరవం ఇస్తూ, వారి సూచనలు పాటించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. చెడు వ్యసనాలకు, ముఖ్యంగా గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జోన్‌లోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎన్టీపీసీ టీటీఎస్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రామగుండం సీఐ కృష్ణకుమార్, సైబర్ నేరాల విభాగం ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సీపీ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

తొలి గురువులు తల్లిదండ్రులే:-

ఈ సందర్భంగా సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులే తొలి గురువులని, వారి తర్వాత ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఏ స్థాయికి ఎదిగినా తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించాలని సూచించారు. చదువు, వ్యక్తిగత జీవితం లేదా ఇతర సమస్యలు, సందేహాలు ఎదురైతే వాటిని మనసులో దాచుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని, వారి మార్గనిర్దేశంతో సమస్యలకు పరిష్కారం పొందాలని తెలిపారు.

గంజాయికి దూరంగా ఉండాలి:-

విద్యార్థులు చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సీపీ హెచ్చరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదం ఉందన్నారు. గంజాయి విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908కు తెలియజేయాలని సూచించారు.

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం:-

సైబర్ నేరాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే అనుమానాస్పద లింకులను తెరవకూడదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

అత్యవసర పరిస్థితులు, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు లేదా ఇతర ఆపద సమయాల్లో పోలీసుల సహాయం కోసం 112కు కాల్ చేయాలని విద్యార్థులకు వివరించారు. గతంలో అందుబాటులో ఉన్న 100 నంబర్ స్థానంలో ప్రస్తుతం 112 అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

విద్యార్థుల భద్రతకు పోలీసుల నిరంతర పర్యవేక్షణ:-

విద్యార్థుల భద్రత కోసం పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సీపీ తెలిపారు. ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు పాఠశాలల పరిసరాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ భద్రతా పరిస్థితులను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులే తమ భద్రతకు తొలి రక్షకులని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని సీపీ ఆకాంక్షించారు.

‘వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు’ పోస్టర్ ఆవిష్కరణ:-

వినాయక చవితిని పురస్కరించుకుని తెలంగాణ సైబర్ భద్రతా విభాగం రూపొందించిన ‘వినాయకుడి నుంచి సైబర్ భద్రత పాఠాలు’ అవగాహన పోస్టర్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ బి. రామ్‌రెడ్డి ఆవిష్కరించారు. సైబర్ మోసాల నుంచి ప్రజలు రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వినూత్న రీతిలో వివరిస్తూ ఈ పోస్టర్‌ను రూపొందించారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, బసంత్‌నగర్ ఎస్‌ఐ శ్రీధర్, రామగుండం ఎస్‌ఐ సంధ్యారాణి, అంతర్గాం ఎస్‌ఐ వెంకట్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి. జయరాజ్, స్థానిక కార్పొరేటర్ కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.