ప్రజావాణి అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…
పెండింగ్ లేకుండా సత్వర పరిష్కారమే లక్ష్యం…
–డీఆర్ఓ రాజేశ్వరి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించే ప్రతి అర్జీని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, సమస్యలను ఓపికగా విని సంబంధిత శాఖలకు వెంటనే పంపిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి జిల్లాకు చెందిన షమిమ్ సుల్తాన తనకు ఇంటి స్థలం కరీంనగర్‌లో ఉన్నందున ఇందిరమ్మ ఇల్లు అక్కడే మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా, పీడీ హౌసింగ్‌కు పంపిస్తూ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రామగుండం జై భీమ్ నగర్‌కు చెందిన గూపాల స్వామి తాను పక్షవాతంతో బాధపడుతున్నానని, ఎంబీఏ పూర్తి చేసిన నేపథ్యంలో తనకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేయగా, వారధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన సాన కొమురయ్య అంగన్వాడీ టీచర్ కుటుంబం నుంచి అక్రమంగా దివ్యాంగుల పెన్షన్, వితంతు పెన్షన్ పొందుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా, జిల్లా సంక్షేమ అధికారికి పంపిస్తూ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ ఆదేశించారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ డి విభాగం పర్యవేక్షకులు ఈశ్వర ప్రసాద్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
