సైబర్ సెక్యూరిటీ” పై వర్క్‌షాప్
** ముఖ్య అతిథిగా “తుడ” చైర్మన్ డాలర్స్
….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతిలోని స్కిల్‌వేద కార్యాలయంలో రెండు రోజుల జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ వర్క్‌షాప్ ఘనంగా ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌ను “తుడ” చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యుడు డాలర్స్ దివాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ వర్క్‌షాప్‌ను మల్టీ నేషనల్ కంపెనీ అయిన ప్రికస్ గ్రూప్ ఆధ్వర్యంలోని స్కిల్‌వేద అండ్ నిజారూప ఫిన్‌టెక్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో తిరుపతిలోని వివిధ డిగ్రీ – ఇంజినీరింగ్ కళాశాలల నుంచి వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొని విశేష స్పందన తెలిపారు.
ప్రారంభోత్సవ సభలో డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిలో ఇలాంటి ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్ నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇప్పుడు సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో యువత ఈ వేదిక ద్వారా పొందే జ్ఞానాన్ని సమాజానికి మేలు చేసే దిశగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. టెక్నాలజీ ఎల్లప్పుడూ సానుకూల దిశలోనే ఉపయోగించబడాలని హితవు పలికారు. ఈ వర్క్‌షాప్‌ను తిరుపతిలోకి తీసుకువచ్చినందుకు ప్రమీల్ అర్జున్ బృందంతో పాటు స్కిల్‌వేద చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వర్చువల్ ప్రపంచంలో డేటా ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రోజుల్లో, సైబర్ హ్యకింగ్ నుండి రక్షణ పొందడం అత్యంత కీలకమన్నారు. నేటి యువత సాంకేతికంగా ముందంజలో ఉండాలి. కేవలం ఉపయోగించడమే కాకుండా, సురక్షితంగా ఆ టెక్నాలజీని వినియోగించే నేర్పు అవసరమని స్వష్టం చేసారు. ఈ తరహా వర్క్‌షాపులు విద్యార్థులకు నూతన దిశను అందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజారూప ఫిన్‌టెక్ ప్రతినిధి ఆదం ప్రసాద్ రెడ్డి కూడా పాల్గొని విద్యార్థులను ఉత్సాహ పరిచారు. అలాగే ప్రికస్ గ్రూప్ రాధేశ్యామ్, సందీప్ అవుటపల్లి, ధనుష్ కుమార్, అవినాష్, కృష్ణతేజ, అభినయ రెడ్డి హాజరై కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకు వచ్చారు. నిర్వాహకుల తరఫున ప్రమీల్ అర్జున్ మాట్లాడుతూ స్కిల్‌వేద కార్యాలయంలో ఇంత భారీ స్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించడం గర్వకారణ మని, డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రోత్సాహం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీపై ప్రాక్టికల్ అవగాహన కల్పించడం, భవిష్యత్తులో వారికి మంచి కెరీర్ అవకాశాలు కల్పించడం తమ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. వర్క్‌షాప్‌లో ఎథికల్ హ్యాకింగ్ బేసిక్స్, మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ, వై-ఫై హ్యాకింగ్, రియల్ టైమ్ థ్రెట్ అనాలిసిస్, సైబర్ లాస్ వంటి అంశాలపై నిపుణులు ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తున్నారు. పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికేట్లు, ఇంటర్న్‌షిప్ అవకాశాలతో పాటు కెరీర్ మార్గదర్శనం అందించబడనుంది. కాగా ఈ వర్క్‌షాప్ శనివారంతో ముగియనుంది.
