ఇందిరమ్మ ఇంటితో నిరుపేదల సొంతింటి కల సాకారం..

Sakshitha news

ఇందిరమ్మ ఇంటితో నిరుపేదల సొంతింటి కల సాకారం…

అర్హులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

— మేయర్ మహంకాళి స్వామి…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: రామగుండం, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అర్హులైన నిరుపేద కుటుంబాలు సద్వినియోగం చేసుకొని సొంతింటి కలను నిజం చేసుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి పిలుపునిచ్చారు.

ఎన్‌టీపీసీ కాకతీయ కళ్యాణ మండపంలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మేయర్ మాట్లాడుతూ, కార్పొరేటర్లు, వార్డు అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులందరికీ ఇందిరమ్మ పథకం ప్రయోజనం అందేలా చూడాలని సూచించారు. స్వంత స్థలం ఉన్న వారు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు, సేల్ డీడ్, ఇంటి పన్ను రసీదులు సమర్పిస్తే ఎల్-2 జాబితా నుంచి ఎల్-1 జాబితాలోకి చేర్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎల్-1లో ఉన్న లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు.

ఎల్-2 జాబితాలో ఉన్న వారికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వ స్థలాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో గృహాలు మంజూరై నిర్మాణం పూర్తి చేసుకోలేని కుటుంబాలకు మరోసారి సహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, బేస్‌మెంట్ వరకు నిర్మాణం చేపట్టిన వారు అక్కడి నుంచి ఇంటిని పూర్తి చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు. ప్రజాపాలనలో గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా, ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతోందన్నారు. దరఖాస్తులను ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలుగా విభజించి పరిశీలిస్తున్నామని, అర్హత నిర్ధారణ అనంతరం జిల్లా స్థాయి ఆమోదంతో, ఇన్‌చార్జి మంత్రి అనుమతి తర్వాతే గృహాల మంజూరు జరుగుతుందని వివరించారు.

ఇల్లు మంజూరైన 45 రోజుల్లోపు నిర్మాణం ప్రారంభించకపోతే మంజూరును రద్దు చేసే అవకాశం ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. అయితే ముందుగా ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులు ప్రతి సోమవారం క్రమం తప్పకుండా విడుదల అవుతున్నాయని, నిర్మాణ పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేసిన మేరకు చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోని అర్హులైన కుటుంబాలు ప్రజాపాలన కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ట్రాన్స్‌జెండర్లు సహా వివిధ వర్గాలకు చెందిన అర్హులందరికీ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ మాట్లాడుతూ, ఎల్-1 జాబితాలోని 449 మంది అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా, వారిలో 184 మంది మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. మిగిలిన లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్‌మెంట్ విస్తీర్ణం 600 చదరపు అడుగులు, స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులకు మించకూడదని పేర్కొన్నారు. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపడితే కంప్యూటర్ ద్వారా బిల్లులు ఆమోదం పొందవని, తిరస్కరణకు గురికాకుండా ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఈ సమావేశంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, పలువురు కార్పొరేటర్లు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేశ్వర్, రామగుండం మండల తహసీల్దార్ రవీందర్ రావు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Scroll to Top