గోదావరిఖనిలో వృద్ధురాలి అనుమానాస్పద మృతి కలకలం….
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు కాలనీలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
చంద్రబాబు కాలనీలో నివాసముంటున్న ఎల్లపూల రమణమ్మ (65) తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న మృతురాలి కుమారుడు ఇంటికి వచ్చి చూడగా, ఆమె మంచంపై మృతదేహంగా కనిపించిందని, మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవికమ్మలు, సుమారు ఐదు తులాల బంగారు గాజులు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సంఘటన స్థలం, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మృతురాలి కుమారుడితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిపైనైనా అనుమానం ఉన్నా లేదా ఘటనకు సంబంధించిన కీలక సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
ఈ కేసును అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు చేసి, నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హామీ ఇచ్చారు.
అనంతరం గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి నుంచి కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారించాలని, కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని అధికారులకు సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
