చిన్న దూరమైనా సీట్ బెల్ట్ ధరించండి… ప్రాణ రక్షణలో కీలక పాత్ర…
-సీపీ అంబర్ కిషోర్ ఝా….
సాక్షిత పెద్దపల్లి/ రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ ఫేజ్-మూడవది కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చౌరస్తా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల ప్రాణ రక్షణ ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 70 శాతం కేసుల్లో సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్లనే తీవ్రమైన గాయాలు లేదా ప్రాణనష్టం జరుగుతున్నట్లు తెలిపారు.
సీట్ బెల్ట్ వినియోగం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాపాయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు.ఫోర్ వీలర్ వాహనాల్లో ఎయిర్ బ్యాగులు ఉన్నప్పటికీ,సీట్ బెల్ట్ ధరించకపోతే అవి సమర్థవంతంగా పని చేయవని స్పష్టం చేశారు.కాబట్టి ఎయిర్ బ్యాగులు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.
వాహనం కొనుగోలు సమయంలో ప్రజలు అధునాతన భద్రతా సదుపాయాలు కలిగిన మోడళ్లను ఎంచుకోవాలని, ముఖ్యంగా ఎయిర్ బ్యాగులు,సీట్ బెల్ట్ రిమైండర్లు వంటి భద్రతా లక్షణాలను పరిశీలించాలని సూచించారు.
చిన్న దూరమైనా,పెద్ద దూరమైనా ప్రతి ప్రయాణంలో సీట్ బెల్ట్ ధరించడం అలవాటు చేసుకుంటే దాదాపు 90 శాతం ప్రమాదాలను నివారించవచ్చని, ఒకవేళ ప్రమాదం జరిగినా ప్రాణనష్టం లేకుండా కాపాడుకోవచ్చని తెలిపారు.రోడ్డు భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వాహనదారులను సీపీ కోరారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, గోదావరిఖని టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రసాదరావు,ఎస్‌ఐలు రమేష్,అనూష, మనోహర్,ట్రాఫిక్ ఎస్‌ఐ హరీష్ శేఖర్, రామరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY