మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి – డీఆర్వో రాజేశ్వరి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, మహనీయుల త్యాగాలు, సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి అన్నారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్ధంతి, కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డీఆర్వో రాజేశ్వరి మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో నేలరాలిన తొలి అమరుడని, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహా యోధుడని కొనియాడారు. ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
అలాగే కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రజానాయకుడని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అరుదైన ఘనత సాధించారని, రోడ్లు–భవనాలు, రవాణా, హౌసింగ్, విద్యుత్, హోంశాఖ, వైద్య ఆరోగ్యం, విద్య తదితర శాఖలకు మంత్రిగా సమర్థవంతంగా సేవలందించారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు అనంతరం తమిళనాడు గవర్నర్‌గా కూడా విశిష్ట సేవలు అందించారని తెలిపారు.
మహనీయులను ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితం చేయకుండా వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని డీఆర్వో రాజేశ్వరి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, బీసీ సంక్షేమ అధికారి రంగారెడ్డి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సురేష్, ఎస్సీ సంక్షేమ అధికారి ఎం. రవీందర్, మైనారిటీ సంక్షేమ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
