ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి
** ఏఐఆర్ఎఫ్ రైల్వే కార్మికుల నిరసన
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: దేశంలో విపరీతంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, కార్మికుల వేతనాలు పెంచాలని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు తిరుపతిలో నిరసన చేపట్టారు. అల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) న్యూ ఢిల్లీ అధినాయకత్వం పిలుపు మేరకు అనుబంధ యూనియన్లన్నీ తిరుపతి రైల్వే స్టేషన్ కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించాయి. ఇందులో రైల్వే జనరల్ బ్రాంచ్ అండ్ టెక్నికల్ బ్రాంచుల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని మాట్లాడారు. గుంతకల్ డివిజన్ రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కందాళం సుదర్శన రాజు ముఖ్య అతిథిగా హాజరై నిరసనకు సంఘీభావం తెలిపారు. రాజు మాట్లాడుతూ 8వ వేతన సంఘాన్ని నియమించడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్త నిరసన కార్య క్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్, తిరుపతి జనరల్, టెక్నికల్ శాఖల ఆధ్వర్యంలో ఉదయం 09.00 గంటల నుండి 11.00 గంటల వరకు తిరుపతి లోని వివిధ కార్యాలయాల ఎదుట అనేక మంది కార్మికులతో ఎర్ర జెండాలను చేత పట్టి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. 8వ వేతన సంఘ సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అమలు కావలసి ఉన్నా, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము ఎటువంటి సంఘాన్ని ఏర్పాటు చేయక పోవడము శోచనీయమని, వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేసి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఎటువంటి వేతన సంఘాన్ని ఏర్పాటు చేయకుండా ఎప్పుడు పడితే అప్పుడు కాల నిర్దిష్టత లేకుండా జీతాలు పెంచుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కార్మికులకు ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచు తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వ కార్మికులకయితే పది సంవత్సరాలకు ఒకసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి, నివేదిక సమర్పించిన తరువాత ప్రభుత్వానికి అంగీకారంగా లేకుంటే దానిని సవరించి, కార్మిక సంఘాలతో కనీస చర్చలైనా చేయకుండా పోవడం సరికాదన్నారు. గడువు ముగిసిన తరువాత అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎందుకు కేంద్ర ప్రభుత్వ కార్మికులపై ఇంత వివక్ష అని నిలదీశారు.
కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి అందుకు అవసరమైన గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని, వీలైనంత త్వరగా పెరుగుతున్న ధరలను, రాబోవు పది సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని వేతనాలను నిర్ణయించాలని కోరారు.
అలాగే రాష్ట్ర, బ్యాంకు ఉద్యోగులతో సమానంగా ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ కార్మికులకు కూడా వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వము స్పందించక పోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో అధ్యక్షులు ఈశ్వరయ్య, సెక్రటరీలు నారాయణ స్వామి, రవీంద్ర నాయక్, కోశాధికారులు మారయ్య , గౌస్ బాషా ఇతర కార్యకర్తలు వెంకటేష్, జగదీశ్, శ్రీనివాసులు, అమిత్ పాశ్వాన్, శేఖర్ రెడ్డి, రోహిణి తదితరులు పాల్గొన్నారు.
