అతి త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు నీటి ప్రాజెక్టులు సందర్శించి సమీక్షించనున్న నేపథ్యంలో ఎదుల రిజర్వాయర్ ను పరిశీలించిన ………..రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్ట్‌లను వేగవంతంగా పూర్తి చేస్తాం: మంత్రి జూపల్లి
సాక్షిత వనపర్తి : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాకు తాగు నీరు ఇచ్చేందుకు జూన్, మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా సందర్శించి సమీక్షించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏదుల రిజర్వాయర్ ను సందర్శించి పరిశీలించారు.
వనపర్తి జిల్లా శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, అచ్చంపేట శాసన సభ్యులు వంశీకృష్ణ తో కలిసి ఎదుల రిజర్వాయర్ పంప్ హౌజ్ ను సందర్శించి ప్రస్తుత స్థితిగతులు, పూర్తి అయిన పనులను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రిజర్వాయర్ గురించి ఇరిగేషన్ ఎస్. ఈ పార్థసారథి వివరిస్తూ (5) స్టేజిలలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు పారుతున్న నీటిని ఎత్తిపోతల ద్వారా నార్లపూర్ (అంజనగిరి) రిజర్వాయర్ లో నింపి అక్కడి నుండి ఎత్తిపోసి 6.55 టి.యం.సి. ల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఎదుల రిజర్వాయర్ నింపడం జరుగుతుందన్నారు. ఎదుల రిజర్వాయర్ నుండి వట్టేం, ఉదండపూర్, కే.పి. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ల ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సాగు, తాగు నీరు అందించడం జరుగుతుందన్నారు. ఎదుల సర్జిపుల్ నుండి 134 మీటర్ల ఎత్తున ఉన్న రిజర్వాయర్ నింపడానికి 10 మోటార్లు ఏర్పాటు చేయడం జరిగిందని, రోజుకు రెండు టి.యం.సి ల నీటిని ఎత్తిపోసేందుకు ఒక్కో పంపు 1.45 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. సంవత్సరంలో 45 రోజుల పాటు 90 టి.యం.సి ల నీటిని ఎత్తిపోసేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగిందని వివరించారు.
మోటారు పంపుల సామర్థ్యం, వాటి ధర, మన్నిక తదితర విషయాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ వేగవంతంగా చేయడానికి, సమస్యల పరిష్కారం, అవాంతరాలను తొలగించడానికి ప్రాజెక్ట్ లను సందర్శించినట్లు చెప్పారు.
వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, వనపర్తి జిల్లా ఎస్పీ సునితా రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రాం సింగ్ పాటిల్, ఇరిగేషన్ ఎస్.ఈ పార్థసారథి, కార్యనిర్వహక ఇంజనీర్లు అమర్ సింగ్, రవీందర్, శ్రీనివాస్, వనపర్తి ఆర్డీఓ సుబ్రమణ్యం, కొల్లాపూర్ ఆర్డీఓ బన్సిలాల్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

