ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది : వేముల వీరేశం
నకిరేకల్, : రైతు నుండి ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రైతుల వద్ద నుంచి ఉత్పత్తి అయిన ప్రతి గింజ ధాన్యాన్నీ ప్రభుత్వం కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. సోమవారం ఆయన నకిరేకల్ మండలంలోని కడపర్తి, చందంపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ “ప్రభుత్వం రైతుల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తోంది. నేడు మండలంలోని పలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాము. ఇటీవల వర్షాలు కురుస్తున్న కారణంగా రైతులు తడిసిన ధాన్యాన్ని కూడా భయపడకుండా కేంద్రాలకు తరలించవచ్చు. ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది. ఎవరూ ఆందోళన చెందవద్దు,” అని అన్నారు.అలాగే శాఖల అధికారులు, రైతు సంఘ ప్రతినిధులతో కలిసి కొనుగోలు ప్రక్రియను నిరంతరం సమీక్షిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రైతుల సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
