ఆర్‌టీసీ బంద్ నేపథ్యంలో డిపోల వద్ద కట్టుదిట్టమైన భద్రత…..
గోదావరిఖని, మంథని డిపోల సందర్శన, శాంతియుతంగా సమ్మె నిర్వహించాలని డీసీపీ బి. రామ్ రెడ్డి సూచన…
సాక్షిత పెద్దపల్లి// తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌టీసీ బంద్ పిలుపు నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. పెద్దపల్లి జోన్ డీసీపీ బి. రామ్ రెడ్డి గోదావరిఖని, మంథని ఆర్‌టీసీ డిపోలను పోలీస్ అధికారులతో కలిసి గురువారం సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్భంగా డిపోలలో ఆర్‌టీసీ ఉద్యోగులతో ప్రత్యక్షంగా మాట్లాడిన డీసీపీ, సమ్మెను ప్రజాస్వామ్య హక్కుగా గౌరవిస్తున్నప్పటికీ శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. బంద్ సమయంలో ఎటువంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని కోరారు.
అల్లర్లు సృష్టించడం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం, అధికారులపై దాడులకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగులు తమ సమస్యలను శాంతియుతంగా వ్యక్తపరచాలని, చట్టాన్ని గౌరవించాలని సూచించారు.
సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాత్కాలికంగా విధుల్లో చేరే ప్రైవేట్ డ్రైవర్లు, తిరిగి విధుల్లో చేరే ఆర్‌టీసీ డ్రైవర్లకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.
డిపో, బస్‌స్టాండ్ పరిసరాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలపై వెంటనే స్పందించాలని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు. ప్రజలు వదంతులను నమ్మకుండా, శాంతి భద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్శనలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, మంథని సీఐ బి. రాజు, ఎస్సై రమేష్, ఆర్‌టీసీ డీఎంలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY