మంచిర్యాలలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు….
ప్రధాన కూడళ్లను పరిశీలించిన డీసీపీ ఎ. భాస్కర్
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మంచిర్యాల,
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టాల్సిన చర్యలపై మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ ప్రధాన కూడళ్లను పరిశీలించారు.
ఐబీ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ థియేటర్ చౌరస్తా తదితర కీలక కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు, వాహనాల రద్దీ నియంత్రణ, రహదారి భద్రతకు అవసరమైన మౌలిక సదుపాయాలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, కార్పొరేషన్‌గా అభివృద్ధి చెందిన మంచిర్యాల నగరంలో ట్రాఫిక్ క్రమశిక్షణ, సమర్థవంతమైన రవాణా వ్యవస్థ అత్యంత కీలకమని అన్నారు. ప్రధాన రహదారుల ద్వారా వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు రాకపోకలు సాగుతుండటంతో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటోందని తెలిపారు.
హైదరాబాద్ ట్రాఫిక్ ఇంజినీరింగ్ నిపుణుల అధ్యయనం, స్థానిక ఎమ్మెల్యే చొరవతో తొలి విడతలో నాలుగు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సిగ్నల్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా ఫ్రీ లెఫ్ట్‌లు, బొల్లార్డులు, స్టాప్ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట్ల ప్యాచ్‌వర్క్‌లు, యూ-టర్న్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మంచిర్యాలలో కొన్ని కూడళ్లు ఐదు, ఆరు రహదారులు కలిసే ప్రాంతాలుగా ఉండటంతో ప్రత్యేక ప్రణాళికతో ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు. ట్రాఫిక్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మార్పులు, మెరుగుదలలు చేపడతామని పేర్కొన్నారు.
ప్రజలను ఉద్దేశించి డీసీపీ మాట్లాడుతూ, “ట్రాఫిక్ నియమాలు ప్రతి ఒక్కరి భద్రత కోసమే. సిగ్నల్స్‌ను ఉల్లంఘించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి నియమాలను తప్పనిసరిగా పాటించి పోలీసులకు సహకరించాలి” అని విజ్ఞప్తి చేశారు.
ఈ పరిశీలనలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాశ్, టౌన్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ రావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ హనన్, మేయర్ ధరణి మధు, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
