కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే ఈ తరహా పెన్షన్ పంపిణీ:

Sakshitha news

కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే ఈ తరహా పెన్షన్ పంపిణీ: ప్రత్తిపాటి

సాక్షిత చిలకలూరిపేట:మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ప్రస్తుత భారతదేశంలో ₹4,000, ₹6,000, ₹10,000, ₹15,000 పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే ఈ తరహా పెన్షన్ పంపిణీ జరుగుతోందని అన్నారు. సంవత్సరానికి ₹34,000 కోట్లు పెన్షన్ల కోసం పంచుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశని తెలిపారు.భర్త చనిపోయిన మహిళలకు ₹1,09,000 స్పౌజ్ పెన్షన్లు ఇస్తున్నామని, గతంలో 18 నుంచి 24 సంవత్సరాల మధ్య భర్త చనిపోయిన వారిని ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించి, ₹1,09,000 కుటుంబాలకు కొత్తగా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల కుటుంబాలకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని, ₹4,000, ₹6,000, ₹10,000, ₹15,000 ఇంటికి చేరడంతో లబ్ధిదారుల కళ్ళలో ఆనందం కనిపిస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం వల్లే తమకు పెన్షన్లు అందుతున్నాయని, తమ జీవితాల్లో కష్టాలు పోయి సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారని వివరించారు. ఈ పెన్షన్ల వల్ల వృద్ధులు, వికలాంగులు, బెడ్ రెడన్ అయిన వారికి గౌరవం పెరిగిందని, ఎవరి మీదా ఆధారపడకుండా జీవనం సాగించే అవకాశం కలిగిందని తెలిపారు.

చిలకలూరిపేట పట్టణంలో సుమారు ₹4.79 కోట్ల విలువైన పెన్షన్లను పంపిణీ చేశామని, మూడు మండలాలను కలుపుకుంటే చిలకలూరిపేట నియోజకవర్గానికి ₹10 కోట్లకు పైగా పెన్షన్ల కోసం నిధులు వచ్చాయని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత, సంక్షేమానికి రెండవ ప్రాధాన్యత ఇచ్చేవారని, కానీ ఇప్పుడు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి రెండవ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేసినా, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాలన్నీ అమలు చేస్తారని ఆయన స్పష్టం చేశారు.ప్రతిపక్షం గురించి మాట్లాడుతూ, వారు కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయలేరేమో అనుకున్నారని, కానీ ఇప్పుడు అమలు చేస్తుండటంతో వారికి ఏం చేయాలో పాలుపోక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యల పట్ల పోరాటం చేస్తే ప్రజలు నమ్ముతారని, శవ రాజకీయాలు, చనిపోయిన వారి పేరుతో చేసే పరామర్శలను ప్రజలు విశ్వసించరని పేర్కొన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజలు విసిగి వేసారి ఉన్నారని, గత ఐదేళ్ల పాలనకే భయభ్రాంతులు అయ్యారని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనను ఈ రాష్ట్రంలో ఎవరూ కోరుకోవడం లేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా 15 ఏళ్ళు కొనసాగుతుందని, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి, పోలవరం, అమరావతి పూర్తి చేసి, పెట్టుబడులు తీసుకొచ్చి, నిరుద్యోగులు లేకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆయన పేర్కొన్నారు.