సింగరేణి కార్మికుల మారు పేర్ల సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలి….
కార్మికుల హక్కుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నా…..
— ఎంపీ గడ్డం వంశీకృష్ణ….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : సింగరేణి సంస్థను, అందులో పనిచేస్తున్న కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న ‘నేమ్ చేంజ్/మారు పేర్ల’ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర పవర్ మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖలు రాయడంతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఎంపీ తెలిపారు. సింగరేణి యాజమాన్యానికి కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు.
కోర్టు కేసులు ఉన్నాయంటూ సమస్యను పక్కదారి పట్టించడం సరికాదని వంశీకృష్ణ అన్నారు. కార్మికులు అనేకసార్లు ధర్నాలు, నిరసనలు, వినతిపత్రాల ద్వారా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. వారికి న్యాయం జరిగేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కార్మికుల చెమటతోనే దేశానికి వెలుగు
సింగరేణి కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బొగ్గును వెలికితీస్తూ దేశానికి వెలుగునిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. అలాంటి కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడం సరికాదన్నారు.
సింగరేణి సంస్థ కోసం స్వర్గీయ కాకా వెంకటస్వామి అనేక పోరాటాలు చేశారని, కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన కృషిని ఎంపీ గుర్తు చేశారు. కార్మికుల కష్టం, వారి సేవలను విస్మరించి కేవలం అధికారుల నిర్ణయాలతో సంస్థను నడపడం సరైన విధానం కాదన్నారు.
కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో సింగరేణి సంస్థకే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. కార్మికుల బాధలను పరిష్కరించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని, వారి సమస్యలకు పరిష్కారం చూపకపోతే ఆ బాధ్యత అధికారులపైనే ఉంటుందని స్పష్టం చేశారు.
సింగరేణి సంస్థ దేశానికి ఎంతో కీలకమైనదని, “సింగరేణి నడిస్తేనే ఈ దేశానికి వెలుగు” అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. కార్మికులు కోరుతున్న మారు పేర్ల సమస్యకు వెంటనే పరిష్కారం చూపి వారికి న్యాయం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మరోసారి కోరారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
