విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

Sakshitha news

విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

ప్రైవేటు విద్యా సంస్థలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలి

అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

ఆర్టిఏ అధికారులు పాఠశాలల బస్సులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి……….*బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

సాక్షిత వనపర్తి :
అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలపై విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. త్వరలోనే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కాబోతున్న తరుణంలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం ప్రకారం 25% సీట్లను పేద విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని అన్నారు.

జిల్లాలో కొందరు చదువుల పేరుతో వ్యాపారం చేస్తున్నారని, పాఠశాలల్లోనే పుస్తకాలు, యూనిఫామ్, టై, బెల్టు, షూ అమ్ముతూ అక్రమాలకు పాల్పడుతున్నారని, అలాంటి పాఠశాలలపై బీసీ పొలిటికల్ జేఏసీ ప్రత్యేక నిఘా పెడుతుందని హెచ్చరించారు.

విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్టిఏ అధికారులు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్నెస్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

గతంలో అనేకసార్లు ప్రమాదాలు చోటుచేసుకుని విద్యార్థులు గాయపడి, మృతి చెందిన సందర్భాలను ఆయన గుర్తు చేశారు.

నేడు ప్రభుత్వ విద్య గణనీయంగా మెరుగుపడిందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు.

బీఈడీ, పీజీ పూర్తి చేసి ఎంతో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను బోధిస్తున్నారని పేర్కొన్నారు.

విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కార్పొరేటు మోజులో పడి లక్షల రూపాయలను వృధా చేసుకోవద్దని హితవు పలికారు.

నాణ్యమైన విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపించేలా కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోతే వాటిని సీజ్ చేపించే వరకు బీసీ పొలిటికల్ జేఏసీ విశ్రమించదని హెచ్చరించారు.

నామినల్ ఫీజులు తీసుకుంటూ, ఉత్తమ విద్య అందిస్తున్న పాఠశాలలకు మాత్రం తమ సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి వి గౌడ్, జిల్లా కార్యదర్శి బత్తుల జితేందర్, కృష్ణ ప్రసాద్, అస్కని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top