ప్రజల సంపూర్ణ ఆరోగ్యం..నిజమైన సంతోషమే దేశానికి అసలైన స్వాతంత్ర్యం : ప్రత్తిపాటి
- కేంద్రప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
- పథకాల అమలుకంటే ఆరోగ్యరక్షణకే అధికప్రాధాన్యమివ్వాలి.
- ఉచిత ఆరోగ్య బీమా ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు.. సంపన్నులు పొందే ఉన్నతస్థాయి వైద్యసేవలు అందించాలి
- సామినేని ట్రస్ట్ ఏర్పాటుచేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ నిర్ధారణ ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవంలో మాజీమంత్రి ప్రత్తిపాటి
సంపన్నులు సమాజంలోని అట్టడుగవర్గాలకు అండగా నిలవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం నెరవేర్చేక్రమంలో దాతలు సమాజహితానికి తమవంతు సేవలు అందించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. పీ-4 పథకంతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్ప ఆలోచన, అమలుకు కొంత సమయం పట్టినా.. దానివల్ల కలిగే ఫలితాలు ఎంతో గొప్పగా ఉంటాయని ప్రత్తిపాటి తెలిపారు. సామినేని ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యడ్లపాడు మండలం బోయపాలెంలోని అనంతలక్ష్మి స్పిన్నింగ్ మిల్స్ ఆవరణలో ఏర్పాటుచేసిన బసవతారకం ఇండో అమెరికన్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తో కలిసి ప్రారంభించిన అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు.
కేంద్రప్రభుత్వం పేదలకు ఉచిత ఆరోగ్యబీమా అందించాలి
పేదల ఆరోగ్య రక్షణకోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కృషి చేయాలన్న ప్రత్తిపాటి.. ప్రజలకు ఉచిత వైద్యసేవలు, ఉచిత ఆరోగ్యబీమా అందించే దిశగా కేంద్రప్రభుత్వం ఆలోచించాలని, ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు అందించినా ప్రజలఆరోగ్యానికి సాటిరావని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రభుత్వం ఎన్టీఆర్ ఉచిత వైద్యసేవ ద్వారా పేదల ఆరోగ్యరక్షణకు అండగా నిలుస్తోందని, సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా పేదలవైద్యానికి అండగా నిలుస్తున్నప్పటికీ, ఇంకా చాలామంది పేద, మధ్యతరగతి వర్గాలు సరైన..నాణ్యమైన కార్పొరేట్ వైద్యసేవలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
ప్రజల సంపూర్ణ ఆరోగ్యం… అసలైన సంతోషంతోనే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం
ప్రజల సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం లభించినట్టని ప్రత్తిపాటి చెప్పారు. అనేక రాష్ట్రప్రభుత్వాలు ఆర్థికసమస్యలతో ప్రజారోగ్యంపై సరైన దృష్టి పెట్టలేకపోతోందన్న ప్రత్తిపాటి.. కేంద్రప్రభుత్వం నూతనవిధానాలతో దేశ ప్రజల ఆరోగ్యరక్షణ దిశగా ఆలోచన చేయాలన్నారు. క్యాన్సర్ గుర్తించడం కష్టమని.. దాని లక్షణాలు కూడా త్వరగా బయటపడవని.. ప్రజలు ఎప్పటికప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిదని ప్రత్తిపాటి సూచించారు. తొలిదశలో ఉంటే క్యాన్సర్ నిర్మూలన తేలికేనని.. నిజంగా వ్యాధిబారిన పడినవారు భయపడాల్సిన పనిలేదని ప్రత్తిపాటి చెప్పారు.
క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణలో కోడెల సేవలు వెలకట్టలేనివి
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ సెంటర్ పనితీరు నిర్వహణలో కీ.శే. కోడెల శివప్రసాదరావు ఎంతో కృషి చేశారని, ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివని ప్రత్తిపాటి చెప్పారు. స్వలాభం.. స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా ఎందరో గొప్పవ్యక్తుల సహాయ సహాకారాల వల్లే బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రి వైద్యసేవలు మారుమూల గ్రామాలకు కూడా చేరుతున్నాయన్నారు. సామినేని ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు, విద్యావేత్త శ్రీ సామినేని కోటేశ్వరరావు పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతో పాటు.. ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం నిజంగా అభినందనీయమని ప్రత్తిపాటి ప్రశంసించారు. 21, 22 తేదీల్లో నిర్వహేంచే క్యాన్సర్ నిర్దారణ ఉచిత వైద్యశిబిరాన్ని నియోజకవర్గప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రత్తిపాటి సూచించారు.
కార్యక్రమంలో సామినేని కోటేశ్వరరావు, ప్రవీణ్, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్ మోహన్, కుర్ర రత్తయ్య, కాకతీయ సాంబశివరావు, కందుల రమణ, ముద్దన నాగేశ్వరరావు, మద్దుమలా రవి, కందిమల్ల రాఘవరావు, అడుసుమిల్లి మోహనరావు, డాక్టర్ రేణుక తదితరులున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
