టీటీడీ గురించి మాట్లాడే నైతికత భూమనకు లేదు
** యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్
సాక్షిత ప్రతినిధి – మంగళగిరి / తిరుపతి: ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు తిరుమల పవిత్రతను కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కే దక్కుతుందని యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్
అన్నారు. అలాంటి టీటీడీ గురించి విమర్శలు చేసే నైతికత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి లేదని హితవు పలికారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ… అన్నప్రసాదం పవిత్రతను కాపాడడంలోనూ, సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం చేరువ చేయడంలోనూ ప్రత్యేక స్థానం టీడీపీకే లభించిందని ఆయన గుర్తుచేశారు. టీడీపీ ఎల్లప్పుడూ నిస్వార్థంగా స్వామివారి సేవలో నిమగ్నమై ఉన్న వారినే టీటీడీ చైర్మన్‌లుగా నియమించిందని, ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలిసిన వాస్తవమని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీ నిర్వహణ ఎంత దుర్భర స్థితికి చేరుకుందో భక్తులు స్వయంగా అనుభవించారని చెప్పారు. నాసిరకం సరుకులతో అన్నప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు అందించిన దారుణ స్థితిని ప్రజలు కళ్లారా చూశారని, కోట్లాది మంది భక్తుల డబ్బును దుర్వినియోగం చేస్తూ వైసీపీ హయాంలో స్వామివారి ప్రతిష్ఠను దిగజార్చారని ఆరోపించారు. లక్షలాది పెట్టె అన్నప్రసాదాల విషయంలో వైసీపీ ఏ విధంగా దారుణానికి ఒడిగట్టిందో అందరూ చూశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్న సమయంలో తిరుమల మాడ వీధుల్లో లడ్డు గుమగుమలు భక్తులు ఎరుగరని, ఆ సమయంలోనే మేము ఈ ప్రశ్నను ఎన్నికల ముందు లేవనెత్తామని గుర్తు చేశారు. కరుణాకర్ రెడ్డి ఈ రోజు నీతులు వల్లించడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీటీడీలో కరుణాకర్ రెడ్డి చేసిన అవినీతి చర్యలకు ఆయన సమాధానం చెప్పలేరని నరసింహ యాదవ్ అన్నారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి షెడ్లను వైసీపీ పాలనలో షాపుల కోసం అమ్మేశారని తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల గెలుపు కోసం కరుణాకర్ రెడ్డి కుమారుడు స్వామివారి సొమ్ము రూ.1600 కోట్లను సివిల్ కాంట్రాక్టుల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. టీవీల కుంభకోణం, దర్శనం టికెట్ల కుంభకోణం, తాళిబొట్ల కుంభకోణం, అభిషేకం టికెట్ల కుంభకోణం, తలనీలాల కుంభకోణం, స్వామివారి డాలర్ల కుంభకోణం—ఈ అవినీతి చరిత్ర అంతా కరుణాకర్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. దర్శనం టిక్కెట్లు అమ్ముకుని కోట్ల రూపాయలు వసూలు చేశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి కలసి టీటీడీని వ్యాపార కేంద్రంగా మార్చి స్వామివారి ప్రతిష్ఠను దిగజార్చారని దుయ్యబట్టారు. కరుణాకర్ రెడ్డి రోజుకు 5,000 టిక్కెట్లు జారీ చేస్తే, బి.ఆర్. నాయుడు రోజుకు కేవలం 50 టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తున్నారని, ఇక్కడే ఇద్దరి మధ్య తేడా స్పష్టమవుతుందని తెలిపారు. బి.ఆర్. నాయుడు నిస్వార్థంగా స్వామివారికి సేవ చేస్తున్నప్పుడు, టీటీడీని అడ్డగోలుగా దోచుకున్న వారు ఆయనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రాజకీయ లబ్ధి కోసం, కమీషన్లకు కారకుర్తి పడి తిరుమలలో సత్రాలను కూలగొట్టి హడావుడిగా నిర్మించి దోచుకుతిన్నది కరుణాకర్ రెడ్డేనని తీవ్రంగా విమర్శించారు. కరుణాకర్ రెడ్డికి టీడీపీని, టీటీడీ చైర్మన్‌ను విమర్శించే నైతికత లేదని అన్నారు. పింక్ డైమండ్ మాయమైందని వైసీపీ నీచ రాజకీయాలు ఆడిందని ఆరోపించారు. టీడీపీ ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తుందని, కానీ ఎంపీ ఎన్నికలలో వైసీపీ నకిలీ ఓటర్ కార్డులు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని చెప్పారు. వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఎన్నో ఘోరాలు జరిగాయని, 300కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని అన్నారు. వైసీపీ హయాంలో పవిత్రమైన తిరుమలలో ఎంతమందిని చంపారో జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో లిక్కర్ స్కాంలో వైసీపీ నేతలు అరెస్ట్ కావడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి మైన్స్ దోపిడీ నిజమా కాదా అని ప్రశ్నించగా, త్వరలో చెవిరెడ్డి తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ దోపిడీ కూడా బయటపడుతుందని చెప్పారు. ప్రధాన నగరాల్లో వైసీపీ టీడీఆర్ బాండ్స్ దోపిడీ గురించి ప్రజలకు తెలిసిందేనని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి బంధువర్గంతో కలసి వైసీపీ నేతలు టీటీడీని దోపిడీదారుల, దొంగల కేంద్రంగా మార్చిన చరిత్ర ఉందని నరసింహ యాదవ్ మండిపడ్డారు. వైసీపీ ఆడుతున్న వీధి నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తేల్చిచెప్పారు.
