జిల్లా పరిషత్ స్థలాల అన్యాక్రాంతంపై కలెక్టర్‌కు ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు

Sakshitha news

జిల్లా పరిషత్ స్థలాల అన్యాక్రాంతంపై కలెక్టర్‌కు ఎమ్మార్పీఎస్ ఫిర్యాదు

చిలకలూరిపేట నెహ్రు నగర్ సమస్యపై స్పందించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

చిలకలూరిపేట పట్టణంలోని నెహ్రు నగర్ ప్రాంతంలో జిల్లా పరిషత్ సోషల్ వెల్ఫేర్ విభాగం ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాలు అన్యాక్రాంతమైన నేపథ్యంలో, ఈ రోజు జరిగిన ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ సమావేశంలో ఈ సమస్య చర్చకు వచ్చింది. ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ ఈ సమస్యను సమావేశంలో ప్రస్తావించారు.అనంతరం, అడపా మోహన్ మాదిగ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను వ్యక్తిగతంగా కలిసి అర్జీని సమర్పించారు. అర్జీని పరిశీలించిన కలెక్టర్ కృతికా శుక్లా తక్షణమే ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.కలెక్టర్ వెంటనే చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కి ఎండార్స్ ఇచ్చి, సమస్య పరిష్కారంపై ఫోన్ ద్వారా కూడా చర్చ జరిపారు. అనంతరం, కలెక్టర్ ఇచ్చిన ఎండార్స్ కాపీలను చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కి అందజేసినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అడపా మోహన్ మాదిగ తెలిపారు.ఈ సందర్భంగా అడపా మోహన్ మాదిగ మాట్లాడుతూ, స్థానికంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజల భూసంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. కలెక్టర్ తక్షణమే స్పందించడంపై ఎమ్మార్పీఎస్ హర్షం వ్యక్తం చేసింది.