హిందూ కోడ్ బిల్లు సామాజిక సమానత్వానికి బలమైన పునాది
– దుర్గం ప్రమీల- నగేష్….
సాక్షిత పెద్దపల్లి// భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేడ్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లు దేశంలో సామాజిక సమానత్వ స్థాపనకు కీలకమైన మైలురాయిగా నిలిచిందని, సమతా గ్రంథాలయ నిర్వాహకురాలు దుర్గం ప్రమీల నగేష్ అన్నారు. ఏప్రిల్ -09 చారిత్రక ప్రాధాన్యతను పురస్కరించుకుని గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
1948లో ఇదే రోజున అంబేద్కర్ స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా హిందూ కోడ్ బిల్లును రాజ్యాంగ పరిషత్ ముందు ప్రవేశపెట్టారని ఆమె గుర్తుచేశారు. ఆ బిల్లు కేవలం చట్టపరమైన సంస్కరణ మాత్రమే కాకుండా, కుల, లింగ వివక్షలతో నలిగిన సమాజానికి సమానత్వ దిశగా నూతన దిశానిర్దేశం చేసినదని పేర్కొన్నారు.
హిందూ సమాజంలో చెల్లాచెదురుగా ఉన్న ధర్మశాస్త్రాలు, న్యాయస్థాన తీర్పులు, సంప్రదాయాలను ఒకే చట్ట పరిమితిలోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ బిల్లు రూపొందించబడిందని తెలిపారు. సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించి, సమగ్ర చట్టపరమైన వ్యవస్థను ఏర్పరచడం అంబేద్కర్ ప్రధాన ఆశయమని వివరించారు.
హిందూ కోడ్ బిల్లుపై వచ్చిన విమర్శలకు సమాధానంగా అంబేద్కర్ “ఆచారాలను ధ్వంసం చేయడం కాదు, సమాజ శ్రేయస్సుకు అనుకూలమైన వాటికి చట్టబద్ధత కల్పించడం” లక్ష్యమని స్పష్టం చేశారని గుర్తుచేశారు.
ఈ బిల్లుతో మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు, దత్తత హక్కు వంటి కీలక హక్కులు లభించాయని, స్త్రీ సాధికారతకు ఇది బలమైన పునాది వేసిందని, తీవ్ర ప్రతిబంధకాల మధ్య ప్రారంభమైన ఈ సంస్కరణలు తరువాత విడతలవారీగా చట్టరూపం దాల్చి, నేడు మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
“ఒక దేశ అభివృద్ధిని ఆ దేశ మహిళల పురోగతితో కొలవాలి” అనే అంబేద్కర్ సందేశం నేటికీ సమాజానికి మార్గదర్శకమని దుర్గం ప్రమీల నగేష్ తెలిపారు. సామాజిక న్యాయం సాధనలో ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY