ఉత్తర తెలంగాణ రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం….
—- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: అంతర్గాం, : ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తోందన్నారు. శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి వంటి ప్రధాన ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకుని రైతులకు దశాబ్దాలుగా ప్రయోజనం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు.
ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగమని, దీనిని కాళేశ్వరం ప్రాజెక్టుతో అనుసంధానించి ప్రచారం చేయడం సరికాదన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ సూచనల మేరకు మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా అవసరమైన పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి సదుపాయాలతో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించి, రైతులకు వేల కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, వర్షపాతం పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు అవసరమైన సూచనలు అందిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం బ్యారేజీలపై నిపుణుల సూచనల మేరకే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాల వల్లే మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని విమర్శించారు. నీటిపారుదల రంగంలో జరిగిన తప్పిదాల కారణంగా భారీగా ప్రజాధనం వృథా అయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, గడ్డం వినోద్ కుమార్, వెడ్మ బొజ్జు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
