ఉద్యమకారుల హామీలను వెంటనే అమలు చేయాలి
కమిటీ పేరుతో కాలయాపన వద్దు.. హామీల అమలుకు తక్షణ చర్యలు చేపట్టాలి….
నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య ఉద్యమం: తెలంగాణ ఉద్యమకారుల సమితి హెచ్చరిక….
సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం/ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి డిమాండ్ చేసింది. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి తగిన గౌరవం, గుర్తింపు, ఆర్థిక భరోసా కల్పించాలని కోరింది.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని సమితి నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం అనేక మంది ఉద్యమకారులు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, జైలు జీవితాన్ని సైతం అనుభవించారని గుర్తుచేశారు. వారి త్యాగాలు, పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
హామీల అమలుపై ప్రశ్నలు
రాష్ట్రం ఏర్పడి ఎన్నో సంవత్సరాలు గడిచినా ఉద్యమకారులకు ఆశించిన స్థాయిలో గుర్తింపు, గౌరవం, ఆర్థిక సహాయం అందలేదని సమితి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పలు హామీలు ఇచ్చిందని పేర్కొంది.
ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి రెండున్నర గుంటల ఇంటి స్థలం కేటాయించి ఇల్లు నిర్మించడం, నెలకు రూ.25 వేల పింఛన్, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత రైలు ప్రయాణం తదితర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ హామీల అమలుపై ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.
కమిటీతో సమస్యకు పరిష్కారం రావాలి
ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వివిధ తెలంగాణ ఉద్యమ సంఘాలు ఏకమై పలు దశల్లో ఆందోళనలు నిర్వహించాయని సమితి తెలిపింది. ఉద్యమకారుల పోరాటాల నేపథ్యంలో ప్రభుత్వం హామీల అమలుకు కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ, కమిటీ పేరుతో సమస్యను సాగదీయకుండా స్పష్టమైన కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేసింది.
ఉద్యమకారుల కుటుంబాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, అర్హులైన ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ పథకాలు అందించాలని కోరింది. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, గౌరవం, ఆరోగ్య భద్రత, ఆర్థిక భరోసా వంటి అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది.
నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం
తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మరింత జాప్యం చేస్తే రాష్ట్రంలోని ఉద్యమకారులు, వివిధ ఉద్యమ సంఘాలను సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేపడతామని తెలంగాణ ఉద్యమకారుల సమితి హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడి త్యాగాన్ని ప్రభుత్వం గౌరవించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించి తక్షణమే అమలు చేయాలని సమితి డిమాండ్ చేసింది.


