సింగరేణి కోసం పదేళ్లు మౌనం…
ఇప్పుడు యువతను తప్పుదోవ పట్టిస్తున్న కేటీఆర్…
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర విమర్శలు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
సింగరేణి కార్మికులను, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించే రాజకీయాలు కేటీఆర్ మానుకోవాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నిజంగా కేటీఆర్ మతి ఉండి మాట్లాడుతున్నారా…? లేక మతి లేకుండా మాట్లాడుతున్నారా…? అని ప్రశ్నించారు.
యువతను తప్పుడు దారిలో తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.
“ఖబర్దార్ కేటీఆర్… సింగరేణి కార్మికుడికి గానీ, తెలంగాణ ప్రజలకు గానీ మీ చిల్లర రాజకీయాల వల్ల ఏ చిన్న హాని జరిగినా మేము ఊరుకోము. తగిన విధంగా సమాధానం చెబుతాము” అని హెచ్చరించారు.
పది సంవత్సరాలు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నది కేటీఆర్ కాదా? ముఖ్యమంత్రిగా ఉన్నది మీ సొంత తండ్రి కేసీఆర్ కాదా? అని ప్రశ్నించిన ఆయన, సింగరేణి సమస్యలు అప్పుడే కనిపించలేదా అని నిలదీశారు.
“పది మంది ఎంపీలను పెట్టుకొని పార్లమెంట్లో బీఆర్ఎస్ ఏం సాధించింది? సింగరేణి కార్మికుల కోసం ఒక్కరోజైనా గళం విప్పారా?” అని ప్రశ్నించారు. యువతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.
గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా సింగరేణి సమస్యలపై స్పందించని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గడ్డం వంశీకృష్ణ విమర్శించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
