విద్యార్థులకు సీపీఆర్ పై అవగాహన
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడిసిన్ విభాగం, ఇండియన్ సొసైటీ అఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ సంయుక్త ఆధ్వర్యంలో అకాడమిక్ హైట్స్ స్కూల్ లో కార్డియో పల్మోనరీ రిససిటీషన్ (సి.పి.ఆర్) పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్విమ్స్ మెడిసిన్ విభాగాధిపతి, ప్రొఫెసర్ (సీనియర్ గ్రేడ్) డాక్టర్. అల్లాడి మోహన్ మాట్లాడుతూ స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్.వి.కుమార్ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. సి.పి.ఆర్ పై పాఠశాల విద్యార్థులకు అవగాహన ఎంతో అవసరం, ఈ ప్రక్రియలో తర్ఫీదు పొందిన పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగలరని తెలిపారు.
కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదని, ఒకవేళ కార్డియాక్ అరెస్ట్ తో బాధపడుతున్న వారికి అవయవాలన్ని పనిచేయడం ఆగిపోవడానికి ఐదు నుంచి పదినిమిషాలు సమయం పడుతుందని, ఆ ఐదు నిమిషాల సమయమే అత్యంత విలువైన సమయమని ఈ సమయంలో సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. ఇటీవల కార్డియాక్ అరెస్ట్ మరణాలు పెరుగుతున్న నేపధ్యంలో సి.పి.ఆర్ ద్వారా ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని, కార్డియాక్ అరెస్ట్ వయసుతో సంబంధం లేకుండా ప్రమాదబారిన పడుతున్నారని, కావున విద్యార్థులు సి.పి.ఆర్ పై అవగాహన పెంచుకొని ఎదుటివారి ప్రాణాలను రక్షించాలని విద్యార్థులకు సూచించారు. మెడిసిన్ విభాగం ప్రొఫెనర్ డాక్టర్. హరికృష్ణ మాట్లాడుతూ ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండె స్తంభించి హృదయ స్పందనలు ఆగిపోవడమే కార్డియాక్ అరెస్ట్ అని, కొందరికి గుండెల్లో నొప్పి రాకుండానే ఈ రకమైన గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని, ఆ సమయంలో సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడవచ్చునని, విద్యార్ధులకు సిపిఆర్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.మోహిని, డా.దేవికారెడ్డి, పీజీ విద్యార్థులు, డాక్టర్ శరత్ కుమార్, డాక్టర్ పావని, డాక్టర్ హిమశేఖర్, డాక్టర్ సాయికుమార్, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ దొరబాబు, డాక్టర్ సాయితేజ, డాక్టర్ మనోజ్, అకడమిక్ హైట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, డైరెక్టర్ హిమసాగర్, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY