మహిళల భద్రతకు కఠిన చట్టాలు అమలు చేయాలి…
హింసకు వ్యతిరేకంగా మహిళలంతా ఐక్యంగా పోరాడాలి…
— పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: ఎన్‌టీపీసీ, మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, గృహహింస వంటి ఘటనలను అరికట్టేందుకు కఠిన చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి పిలుపునిచ్చారు.
ఎన్‌టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆదివారం ఏ. లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన పీఓడబ్ల్యూ నిర్మాణ జనరల్ బాడీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలకే పరిమితమవుతూ మహిళల భద్రతను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పని ప్రదేశాల్లో మహిళా కార్మికులు అనేక రకాల వేధింపులు, అవమానాలు ఎదుర్కొంటున్నారని, వారి రక్షణకు సమగ్ర చట్టాలు తీసుకురావడంతో పాటు వాటిని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు అనేక ఉద్యమాలు నిర్వహించినప్పటికీ మహిళలపై హింస కొనసాగుతూనే ఉందని, దీనికి వ్యతిరేకంగా మహిళలందరూ ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు సంబంధించిన హామీలు, ముఖ్యంగా ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సహాయం, వితంతు పింఛన్లు తదితర హామీలను ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే అన్ని హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిలక శంకర్, జిల్లా నాయకులు పి.స్వామి,బి. కొమురయ్య, డి.రవి, ఆర్.రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎన్‌టీపీసీ పట్టణ పీఓడబ్ల్యూ నూతన 11 మంది కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఏ. లక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా ఓ.సంధ్య, ప్రధాన కార్యదర్శిగా పి.కవిత, సహాయ కార్యదర్శిగా రజిత, కోశాధికారిగా కె.రాధ, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఓ. శారద, ఆర్.మండమ్మ, పి.విజయలక్ష్మి, ఎస్. భాగ్యమ్మ, సభ్యులుగా ఎస్.రాయమల్లమ్మ, ఎస్. ఓదమ్మ ఎన్నికయ్యారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
