రొమ్ము క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స
** స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్
….
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న తిరుపతిలోని “స్విమ్స్” ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని “స్విమ్స్” డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్ తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపుమేరకు అక్టోబరు మాసంను రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటాం. ఇందులో భాగంగా స్విమ్స్ పరిధిలోని పద్మావతి ఆసుపత్రి మెడికల్ ఆంకాలజి విభాగం ఆధ్వర్యంలో బుధవారం రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమం జరిగింది. రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక చికిత్సా విధానాలైన సర్జరీ, కీమోథెరపి, రేడియోథెరపీ స్విమ్స్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మహిళలు అవగాహన పెంచుకుని స్వీయ పరీక్ష చేసుకోవాలని కోరారు. ముందుగా అవగాహనా కార్యక్రమాన్ని
డైరెక్టర్ డా. ఆర్.వి.కుమార్ రిజిస్ట్రార్ డా. అపర్ణ ఆర్.బిట్లా, మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డా.భార్గవి, రేడియేషన్ ఆంకాలజి విభాగాధిపతి డా.సుబ్రమణియన్, రేడియాలజీ విభాగాధిపతి డా.విజయలక్ష్మి సంయుక్తంగా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. డా. ఆర్.వి.కుమార్ మాట్లాడుతూ మహిళలు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకుని వైద్యులు సూచించిన విధంగా తరచుగా స్వీయపరీక్ష చేసుకోవాలని, ఏదైనా అనుమానం కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదిక నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు పింక్ బస్సుల ద్వారా ఇప్పటివరకు 713 క్యాంపులు నిర్వహించి, దాదాపు 42 వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని, దాదాపు 3 వేల మంది అనుమానితులను గుర్తించి 895 మందికి క్యాన్సర్ వైద్యం అందించినట్టు తెలిపారు. స్విమ్స్‌కు వచ్చే క్యాన్సర్ రోగుల్లో అర్హులైనవారికి ఎన్‌టీఆర్ వైద్యసేవ, ప్రాణదానం పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు వివరించారు.
మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డా.భార్గవి మాట్లాడుతూ రొమ్ము క్యాన్సర్‌ను మొదటి, రెండు దశల్లో గుర్తిస్తే పూర్తిగా నయం చేసి మరణాల శాతాన్ని తగ్గించవచ్చని తెలిపారు. స్విమ్స్‌లో 25 సంవత్సరాలుగా క్యాన్సర్‌కు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా రోగులకు రొమ్ము క్యాన్సర్ వైద్యం అందించినట్టు తెలియజేశారు. మహిళలందరూ ఈ వ్యాధిపై అవగాహన పెంచుకుని రొమ్ము క్యాన్సర్‌ను జయించాలని కోరారు.
రేడియాలజి విభాగాధిపతి డా.విజయలక్ష్మి మాట్లాడుతూ మామోగ్రఫీ స్క్రీనింగ్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చని, 35 సంవత్సరాలు పైబడిన మహిళలందరూ ఈ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఈ పరీక్షలో రేడియేషన్ చాలా తక్కువ మోతాదులో మాత్రమే ఉంటుందని, కావున మహిళలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి అల్ట్రాసోనోగ్రఫీ పరీక్ష ద్వారా రొమ్ము పూర్తిగా తొలగించకుండా గడ్డను మాత్రమే తొలగించే సదుపాయం ఉందన్నారు. వీటితోపాటు రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం కాంట్రాస్ట్ మమోగ్రఫీ, ఎంఆర్‌ఐ తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
అనంతరం మెడికల్ ఆంకాలజీ డా.భవిత స్వీయ రొమ్ము పరీక్ష గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పేషంట్లకు, వారి సహాయకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ వెంకట కోటిరెడ్డి, జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ముత్తీశ్వరయ్య, డా.మణిలాల్, డా.శ్రీహరిరావు, డా.ఆదిత్య, డా.మౌర్య, డా.కీర్తన, డా.నితిన్, డా.హారిక, డా.దినకర్, మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ వైద్యులు, పిఆర్ విభాగం ఏడీ రాజశేఖర్, ఎంఎస్‌డబ్ల్యు ప్రసాద్ రెడ్డి, పేషంట్స్, స్విమ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
