స్వర్ణరథంపై శ్రీ కళ్యాణ వెంకన్న కటాక్షం
** రథాన్ని లాగిన టీటీడీ అధికారిణులు
…..
సాక్షిత ప్రతినిధి – తిరుపతి / చంద్రగిరి: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండువగా సాగింది.
శ్రీదేవి – భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు ధగధగ మెరుస్తున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారికి శ్రీభూదేవులు ఇరువైపుల ఉంటారు. శ్రీదేవి(లక్ష్మి) బంగారు. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది.
ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని విశ్వాసం .
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్ , కంకణభట్టర్ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు ముని కుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

