బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
** అవగాహనా సదస్సులో సీడీపీఓ శాంతిదుర్గ
సాక్షిత ప్రతినిధి – శ్రీకాళహస్తి / తిరుపతి: శ్రీకాళహస్తిలో జరగనున్న మహాశివ రాత్రి ఉత్సవాలలో భాగంగా మునిసిపల్ మీటింగ్ హాల్ లో శుక్రవారం స్త్రీ – శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ శాంతిదుర్గ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి సిడిపిఓ బి.శాంతిదుర్గ మాట్లాడుతూ బాల్యవివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ కృష్ణమంజరి మాట్లాడుతూ బాల్య వివాహాల నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్ 1098 కు ఫోన్ చేసి బాల్య వివాహాలు నిర్మూలించాలని తెలిపారు.
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా బాల్య వివాహాలు జరగడం చాలా బాధాకరమని బాల్యవివాహాల వల్ల అమ్మాయి, అబ్బాయి జీవితాలు నాశనం అవుతున్నాయని, సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులు, పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, ఐసిడిఎస్ సిబ్బంది బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. మెడికల్ ఆఫీసర్స్ మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు బాలికలకు, 21 సంవత్సరాల లోపు అబ్బాయిలకి వివాహం చేస్తే పెళ్లి కుమారునికి వారి తల్లిదండ్రులకు పెళ్లిలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసింది. మైనర్ బాలికను వివాహం చేసుకొని తనతో సంసారం చేసిన భర్తకు ఫోక్స్ చట్టం కింద పది సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని తెలిపారు.
ఎస్ఐ మాట్లాడుతూ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకునే వయసులోనే వివాహం చేసి చిన్నారుల జీవితాలతో ఆడుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్యవివాహాలను అడ్డుకట్ట వేసేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతుందని ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ఎవరి దృష్టికి వచ్చిన హెల్ప్ లైన్ నెంబర్ 1098 ల ద్వారా వెంటనే సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని తెలిపారు. బాల్య వివాహం నేరం – చట్టం ప్రకారం శిక్షార్హులు, బాల్య వివాహం చేసిన.. చేసుకున్న.. ప్రోత్సహించిన రెండేళ్ల జైలు లక్ష రూపాయల జరిమానా అనే నినాదాలతో తల్లిదండ్రుల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఐసిడిఎస్ విభాగం. తమ తమ అంగన్వాడి కార్యకర్తలతో కలిసి ఇప్పటికే పలు గ్రామాలు పర్యటించి గ్రామస్తులకు బాల్య వివాహాలనిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. ఈ అవగాహన సదస్సులో ఎమ్మార్వో అనిల్, ఎంపీడీఓ పెంచల శ్యాం, డిస్ట్రిక్ట్ మిషన్ కో ఆర్డినేటర్ కృష్ణ మంజరి, శ్రీకాళహస్తి 2 టౌన్ ఎస్ఐ గౌతమీ, సిఐ , మెడికల్ ఆఫీసర్లు శివారెడ్డి, రూపేష్, మెప్మా కో ఆర్డినేటర్, ప్రగతి సంస్థ కోటయ్య తదితరులు పాల్గొన్నారు.

