కమాన్‌పూర్‌లో క్రీడా జోష్…..
కేపీఎల్ టోర్నీలో ఎంకే రైడర్స్ ఘన విజయం
దుద్దిళ్ల శ్రీపాదరావు జ్ఞాపకార్థం నిర్వహించిన క్రికెట్ పోటీలు విజయవంతం….
….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:కమాన్‌పూర్,
దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జ్ఞాపకార్థం కమాన్‌పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు విశేష స్పందన లభించింది.
గత కొన్ని రోజులుగా ఉత్సాహభరితంగా సాగిన ఈ పోటీల్లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు పాల్గొని పోటాపోటీగా తలపడ్డాయి. సెమీఫైనల్‌కు నాలుగు జట్లు చేరుకోగా, చివరకు ఎంకే రైడర్స్, జీపీఎల్ లెజెండ్స్ జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి.
బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జీపీఎల్ లెజెండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 69 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఎంకే రైడర్స్ జట్టు దూకుడైన ఆటతీరుతో కేవలం ఐదు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కిచ్చన్న లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజేత జట్టు ఎంకే రైడర్స్‌కు రూ.50 వేల నగదు బహుమతి, షీల్డ్‌ను అందజేయగా, రన్నరప్ జట్టు జీపీఎల్ లెజెండ్స్‌కు రూ.25 వేల నగదు బహుమతి, షీల్డ్‌ను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతలో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉందని, కేపీఎల్ వంటి టోర్నమెంట్లు యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పోరాటస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ టోర్నమెంట్ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు.
టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన ఫ్రాంచైజీ ఓనర్లను ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి సహకారం వల్లే ఈ పోటీలు ఘనంగా నిర్వహించగలిగామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
