కేజీబీవీల్లో విద్యా నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలి….
మూడు నెలల్లో మౌలిక వసతుల సమస్యల పరిష్కారం.. ఇక విద్యా ఫలితాలే లక్ష్యం: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
సాక్షిత పెద్దపల్లి జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీలు) ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యా నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీతో కలిసి కేజీబీవీల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించామని, అధిక శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. మరో మూడు నెలల్లో మిగిలిన మౌలిక వసతుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని, ఇకపై విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పరీక్షల ఫలితాల మెరుగుదలపై విద్యాశాఖ పూర్తి బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోతే దానికి ఉపాధ్యాయులు, విద్యాశాఖ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. కేజీబీవీల్లో విద్యార్థులు 24 గంటలు పర్యవేక్షణలోనే ఉంటారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గతంతో పోలిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో ఎక్కువ మంది విద్యార్థులు అత్యధిక మార్కులు, 10 జీపీఏ సాధించేలా లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.
ఫిజిక్స్‌వాలా, అనఅకాడమీ వంటి డిజిటల్ లెర్నింగ్ యాప్‌ల వినియోగాన్ని పెంచాలని, విద్యార్థులు ప్రతిరోజూ అభ్యాసం చేసేలా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ యాప్‌లను పూర్తి స్థాయిలో వినియోగించడం లేదని, ప్రతి విద్యార్థి డిజిటల్ లెర్నింగ్‌ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలోని ఏ కేజీబీవీలోనైనా సమస్యలు ఉంటే సమీక్ష సమావేశాల వరకు వేచి చూడకుండా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. బోర్‌వెల్ మరమ్మతులు, తాగునీటి సమస్యలు, మిషన్ భగీరథ కనెక్షన్ల వంటి పెండింగ్ పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.
కేజీబీవీల్లో ల్యాబ్‌లు, ఇతర విద్యా సదుపాయాలు అందుబాటులో ఉన్నందున విద్యార్థుల ప్రవేశాల పెంపు కోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులు అనవసరంగా ఆలస్యమవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, మూడు నెలల్లో అన్ని పెండింగ్ పనులను పూర్తి చేయాలని, పనుల్లో జాప్యం జరిగితే సంబంధిత కాంట్రాక్టర్లకు వెంటనే నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జీసీడీవో కవిత, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
