నైనీ గని నుంచి రోజుకు 12 వేల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యం.. సమన్వయంతో ముందుకెళ్లాలని సింగరేణి ఆదేశం

Sakshitha news

నైనీ గని నుంచి రోజుకు 12 వేల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యం.. సమన్వయంతో ముందుకెళ్లాలని సింగరేణి ఆదేశం….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, హైదరాబాద్/ఒడిశా,

ఒడిశా రాష్ట్రంలోని సింగరేణి నైనీ బొగ్గు గని నుంచి బొగ్గు రవాణాను మరింత వేగవంతం చేసి రోజుకు కనీసం 12 వేల టన్నుల బొగ్గు తరలించేలా చర్యలు చేపట్టాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, కార్యనిర్వాహక సంచాలకుడు (బొగ్గు రవాణా) బి. వెంకన్న ఆధ్వర్యంలో నైనీ గనిలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో జిందాల్ స్టీల్, జిందాల్ ఇండియా పవర్, మీనాక్షి ఎనర్జీ, తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి సంస్థ ప్రతినిధులు, బొగ్గు రవాణా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గౌతమ్ పోట్రు మాట్లాడుతూ, నైనీ గని నుంచి సంవత్సరానికి సుమారు 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కానుందని తెలిపారు. ఈ బొగ్గును సమీప విద్యుత్ కేంద్రాలతో పాటు తెలంగాణలోని సింగరేణి ఉష్ణ విద్యుత్ కేంద్రం, తమిళనాడు విద్యుత్ కేంద్రాలకు సకాలంలో చేరేలా రవాణా సంస్థలు, వినియోగదారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

కార్యనిర్వాహక సంచాలకుడు బి. వెంకన్న మాట్లాడుతూ, రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా మరింత సులభంగా జరిగేలా సమీప రైల్వే సరుకు కేంద్రాల వరకు రవాణాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వినియోగదారులు తమకు కేటాయించిన బొగ్గును రోజువారీగా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, రవాణా సంస్థలతో సమన్వయం కొనసాగిస్తామని తెలిపారు.

సమావేశంలో బొగ్గు రవాణా మార్గాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. అనంతరం సింగరేణి ఉన్నతాధికారులు అంగూల్ జిల్లా కలెక్టర్ ఎం. అబ్దుల్ అక్తర్, జిల్లా పోలీసు అధికారి రాహుల్ జైన్‌లను కలిసి రహదారి మార్గంలో బొగ్గు రవాణాకు అవసరమైన సహకారం అందించాలని కోరగా, వారు సానుకూలంగా స్పందించారు.

రోజుకు కనీసం 12 వేల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యాన్ని చేరుకోవడానికి వినియోగదారులు, రవాణా సంస్థలు, సింగరేణి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
అంతకుముందు గౌతమ్ పోట్రు, బి. వెంకన్న నైనీ గనిని సందర్శించి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. సమావేశంలో నైనీ ఏరియా జనరల్ మేనేజర్ డి. బైద్యతో పాటు ఇతర సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top