తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రం ఏర్పాటు

Sakshitha news

తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రం ఏర్పాటు

** పనితీరు పరిశీలించిన అదనపు ఈఓ చౌదరి

సాక్షిత ప్రతినిధి – తిరుమల: తిరుమలలోని పీఏసీ–5లో ఏర్పాటు చేసిన వినూత్నమైన ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రం (రెక్లెయిమ్ ఏస్) పనితీరును అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి పరిశీలించారు. ఆ సంస్థ అధిపతి వివేక్ యంత్రం ఉపయోగాలను వివరించడంతో పాటు ప్రజలకు దీని అవసరంపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.
ఇప్పటికే ఈ యంత్రాన్ని ఉత్తరాఖండ్‌లోని చారధామ్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసి భక్తులు ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లను పవిత్ర గంగా జలాల్లో వేయకుండా, వాటిని సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలివేయవచ్చని, అందుకోసం యూపీఐ ద్వారా లాగిన్ అయ్యి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి,
రింగ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు వదిలివేస్తే వారికి రూ.5 ప్రోత్సాహకంగా లభిస్తుందని తెలిపారు. దీని ద్వారా సామాజిక అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే లక్ష్యమని ఆయన తెలియజేశారు.
ఈ వినూత్న యంత్రం పనితీరును అదనపు ఈవో ప్రశంసించారు. ఈ పరిశీలనలో ఈఈ-5 వేణు గోపాల్‌, ఎలక్ట్రికల్‌ డిఈ చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.