కాలువల ఆక్రమణలు తొలగించండి…
పరిశుభ్ర రామగుండం నిర్మాణానికి సహకరించండి
అశోక్ నగర్, లక్ష్మీ నగర్‌లో ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పర్యటన….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం, గోదావరిఖని నగరంలో కాలువలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డు సందర్శనలో భాగంగా నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి 51వ. డివిజన్ అశోక్ నగర్, లక్ష్మీ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలువలపై అక్రమ నిర్మాణాల కారణంగా నీటి ప్రవాహం అడ్డంకులకు గురై వర్షాకాలంలో ఇళ్లలోకి నీరు చేరడం, మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వ్యాపించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, ఆటోలు సులభంగా రాకపోకలు సాగించేలా వీధులను విశాలంగా ఉంచుకోవాలని సూచించారు.
ఖాళీ స్థలాల్లో చెత్త వేయడం సరికాదని పేర్కొన్న ఎమ్మెల్యే, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారబోసే వారిపై భారీ జరిమానాలు విధించాలని అధికారులకు సూచించారు. పదేళ్లుగా కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను ప్రత్యేక డ్రైవ్ ద్వారా తొలగించడం అభినందనీయమన్నారు.
గత పది రోజులుగా కొనసాగుతున్న పూడికతీత పనుల్లో భాగస్వాములైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది సమర్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
లక్ష్మీ నగర్‌లో రోడ్ల విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలో గణేష్ నగర్ వైపు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న వ్యాపారులకు కృతజ్ఞతలు తెలిపారు.
రామగుండం నగరాన్ని విద్యా, వైద్య, వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. “మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో, నగరాన్ని కూడా అలాగే పరిశుభ్రంగా ఉంచుకోవాలి” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అశోక్ నగర్‌లో మురుగు నీటి కాలువలో జరుగుతున్న పూడికతీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, నీటి ప్రవాహం సాఫీగా ఉండేలా యంత్రాలతో ఎప్పటికప్పుడు శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
